రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని వాటికే అప్పగించేందుకు ఉద్దేశించిన ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. ప్రతిపక్షాలు చేసిన కొన్ని సవరణలను తిరస్కరించిన ఎగువ సభ.. డివిజన్ ఓటింగ్‌ను నిర్వహించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 187 మంది సభ్యులు ఓటేయగా.. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. రాజ్యాంగంలోని 368 అధికరణ ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం. సుదీర్ఘ చర్చ అనంతరం లోక్‌సభలో మంగళవారం ఆమోదం పొందింది. రాష్ట్రపతి ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
చారిత్రకం..
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు సొంత ఓబీసీ జాబితాను కలిగి ఉండేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుందన్నారు. మొత్తంగా 671 కులాలు దీనిద్వారా రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందనున్నాయని చెప్పారు. దేశంలోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఈ బిల్లు చరిత్ర సృష్టించిందన్నారు. దీనిపై ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు మద్దతిచ్చిన విపక్షాలకు కృతజ్ఞతలు చెప్పారు.