నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, కర్ణాటక, రాజస్థాన్‌లో మాత్రమే ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడగా.. భాజపా ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో.. కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగగా.. మూడు స్థానాలను అధికార భాజపా కైవసం చేసుకుంది. భాజపా తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్, మాజీ ఎంఎల్సీ లెహర్ సింగ్ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాజస్థాన్‌లో..రాజస్థాన్‌లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగగా.. మూటింట అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. భాజపా తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్ తివారీ విజయం సాధించారు.