Rajya Sabha Members Retiring In 2024 : 55 మంది రాజ్యసభ సభ్యులు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. వారిలో అత్యధికంగా 27 మంది బీజేపీకి చెందినవారు కాగా, 10 మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు భారాస నుంచి ముగ్గురు, తెదేపా, వైకాపాల నుంచి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
ఏప్రిల్‌లో ఎగువ సభకు వీడ్కోలు పలకనున్న బీజేపీ నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, మన్‌సుఖ్ మాండవీయ, భూపేందర్ యాదవ్, నారాయణ రాణే, పరుషోత్తమ్ రూపాలా, రాజీవ్ చంద్రశేఖర్, వి.మురళీధరన్, ఎల్.మురుగన్ తదితరులు ఉన్నారు.
మన్మోహన్ మళ్లీ పోటీ చేస్తారా?
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కమలదళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు పదవీకాలము కూడా ఏప్రిల్‌తో పూర్తికానుంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మళ్లీ పెద్దల సభకు పోటీ చేయకుండా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో సగం సగం!
అయితే రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకు ఆరు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలోని ఆరు సీట్లను కమలదళం, ప్రతిపక్షాలు ప్రస్తుతం ఉన్నట్లే సగం సగం పంచుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం దాదాపుగా ఖాయమే.