రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే కంటతడి పెట్టారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.
వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన
11:09 August 11
వెంకయ్య తీవ్ర భావోద్వేగం- ఎంపీల తీరుపై ఆవేదన
"ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ దేవాలయంలాంటిది. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భగుడిలో నిరసన తెలిపినట్లే. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నిద్రపట్టే పరిస్థితి లేదు. నా ఆవేదనను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సభలో కార్యకలాపాలను స్తంభింపజేయడం మంచి పరిణామం కాదు."
--వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్.
సభ పవిత్రతను దెబ్బతీసేంతలా సభ్యులు ఎందుకు ప్రవర్తించారో తెలుసుకునేందుకు తీవ్రంగా ఆలోచించినట్లు చెప్పారు వెంకయ్య నాయుడు. 'వ్యవసాయ సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాం. దీనిపై సభ్యులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఈ అంశంపై పూర్తిగా చర్చించి దానికి వ్యతిరేకంగా వారు ఓటు వేయాల్సింది. కానీ, ఇలా చేయడం సరికాదు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సభలో జరిగిన ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనూ కొందరు సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. గట్టిగా నినాదాలు చేస్తూ మరోమారు గందరగోళం సృష్టించారు. ఫలితంగా రాజ్యసభను కాసేపు వాయిదా వేశారు ఛైర్మన్.