Rajouri Encounter Today :ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. మరికొందరు సైనికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగింది. ఇంకా ఇరువైపుల నుంచి భీకరంగా కాల్పులు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాజౌరీ జిల్లాలోని బాజిమాల్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్న సైనికులపై... ముష్కరులు కాల్పులు జరపటం వల్ల ఎన్‌కౌంటర్ మొదలైనట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికాధికారులు, మరో ఇద్దరు జవాన్లు గాయపడగా... వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వారు చనిపోయినట్లు సైనికాధికారులు ప్రకటించారు.
అడవిలో ఇద్దరు ఉగ్రవాదులు కనిపించినట్లు అధికారులు చెప్పారు. వీరిని పట్టుకునేందుకు బుధవారం మరిన్ని దళాలను రంగంలోకి దింపగా.. ముష్కరులు కాల్పులకు తెగబడ్డారని వివరించారు. ఓ ప్రార్థనా స్థలాన్ని ఆవాసంగా ఉపయోగించుకున్నారని తెలిపారు. గత కొన్ని ఎన్‌కౌంటర్ల తర్వాత నుంచి పీర్‌పంజాల్ అడవులు భద్రతా దళాలకు పెద్ద సవాల్‌గా మారాయి. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఉగ్రవాదులు స్థావరంగా మార్చుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని స్థానికులు చెప్పారు. అందువల్ల కనీసం బయటకు రాలేకపోతున్నామని.. పిల్లలు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు.