Rajouri Encounter Martyrs Last Rites :జమ్ముకశ్మీర్ రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో అమరులైన జవాన్లకు ఘన నివాళులు అర్పించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. జమ్ములోని ఆర్మీ జనరల్ ఆస్పత్రిలో ఉంచిన వీరి భౌతికకాయాలకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సహా పలువురు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. పోలీసులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి తుదివీడ్కోలు పలికారు. అనంతరం అంత్యక్రియల కోసం వారి స్వస్థలాలకు తరలించారు.
బుధవారం రాజౌరీలో జరిగిన ఎన్‌కౌంటర్ ఇద్దరు యువకెప్టెన్లు ముగ్గురు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కెప్టెన్ శుభం గుప్తా ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాకు చెందినవారు కాగా.. కెప్టెన్ ఎంవీ ప్రంజల్ కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన వారు. హవల్దార్ అబ్దుల్ మాజిద్ స్వస్థలం జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా అజోటే. లాన్స్‌నాయక్ సంజయ్ బిష్త్.. ఉత్తరాఖండ్‌లోని హల్లి పడ్లీ నుంచి, పారాట్రూపర్ సచిన్ లౌర.. యూపీలోని అలీగఢ్ నుంచి వచ్చి సైన్యంలో చేరారు.
డిసెంబర్ 6నే వివాహం.. త్వరలోనే వస్తానని చెప్పి..
వీరమరణం పొందిన సచిన్ లౌర ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అమర జవాన్ త్యాగానికి గ్రామస్థులు మౌనం పాటించారు. తమ కుటుంబంలో సచిన్ అందరికన్నా చిన్నవాడని బంధువులు తెలిపారు. సచిన్ అన్న వివేక్ లౌర.. నేవిలో విధులు నిర్వహిస్తున్నారు. డిసెంబరు 6న సచిన్ పెళ్లి ముహూర్తం నిశ్చయించినట్లు.. దానికి సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతలోనే సచిన్ మరణ వార్త తమని తీవ్రమైన శోకానికి గురిచేసిందన్నారు. సచిన్ తండ్రి రమేశ్ లౌర తన కొడుకుతో మాట్లాడిన చివరి మాటలను గుర్తుచేసుకున్నారు. త్వరగానే వస్తానని చెప్పిన సచిన్‌కు ఇలా జరుగుతుందని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు. రక్షబంధన్ రోజు సచిన్‌తో గడిపిన చివరి క్షణాలు గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.