తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హెలికాప్టర్ క్రాష్​పై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు: రాజ్​నాథ్ - హెలికాప్టర్ ప్రమాదం రాజ్​నాథ్ సింగ్

Rajnath singh statement Bipin rawat: జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న చాపర్​ ప్రమాదానికి గురవడంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్.. పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటన చేశారు. ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే విచారణ ప్రారంభమైందని తెలిపారు. ఘటన జరిగిన తీరును వివరించారు.

rajnath singh statement on bipin rawat
rajnath singh statement on bipin rawat

By

Published : Dec 9, 2021, 11:20 AM IST

Updated : Dec 9, 2021, 12:48 PM IST

లోక్​సభలో రాజ్​నాథ్ సింగ్ ప్రకటన

Rajnath singh statement Bipin rawat: త్రిదళపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పార్లమెంటు ఉభయసభల్లో కీలక ప్రకటన చేశారు. ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తునకు వాయుసేన ఆదేశించినట్లు తొలుత లోక్​సభలో వెల్లడించారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. విచారణ బృందం గురువారమే వెల్లింగ్టన్​కు చేరుకుందని స్పష్టం చేశారు. దర్యాప్తు సైతం ప్రారంభమైందని వివరించారు.

"బుధవారం ఉదయం 11.48 గంటలకు సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఎంఐ 17 వీ 5 హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లింగ్టన్‌ బయల్దేరారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వీరు ల్యాండ్‌ అవ్వాల్సి ఉండగా.. 12.08 గంటల ప్రాంతంలో హెలికాప్టర్‌ రాడార్‌ నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సంకేతాలు నిలిచిపోయాయి. భారీ శబ్దం రావడం వల్ల స్థానికులు అక్కడికి వెళ్లారు. స్థానికులు వెళ్లేసరికి హెలికాప్టర్ మంటల్లో ఉంది. రావత్‌, హెలికాప్టర్‌ ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. సీడీఎస్​ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య మృతిచెందడం బాధాకరం. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాం."

-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణమంత్రి

లైఫ్ సపోర్ట్‌పై గ్రూప్‌ కెప్టెన్‌..

ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఆయనకు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌ సింగ్‌కు వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా ప్రసంగించారు. కూనూర్​ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ సభ్యులంతా నిమిషం పాటు మౌనం పాటించారు.

'మేమూ మాట్లాడతాం..'

రాజ్యసభలో రాజ్​నాథ్ సింగ్ ప్రకటన

అనంతరం రాజ్యసభలో ఇదే అంశంపై ప్రకటన చేశారు రాజ్​నాథ్​. అయితే, మంత్రి ప్రకటన తర్వాత తమకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ్యులకు రెండు నిమిషాల చొప్పున ప్రసంగించేందుకు అనుమతించాలని రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే.. సభాపతిని కోరారు. అయితే రాజ్​నాథ్ ప్రకటన చేసినందున.. ఇతర సభ్యులు మాట్లాడాల్సిన అవసరం లేదని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయన్ సింగ్ స్పష్టం చేశారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం

Last Updated : Dec 9, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details