మంత్రుల విమానం ల్యాండింగ్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ పెద్ద సాహసం చేశారు. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సీ-130జే రవాణా విమానంలో ప్రయాణిస్తూ.. రాజస్థాన్ బాడ్మేర్లోని జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యారు. వీరితో కలిసి ఆ విమానంలో ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా కూడా ప్రయాణించారు.
బాడ్మేర్లోని జాతీయ రహదారి 925పై వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్స్, ఇతర విమానాలు అత్యవసరంగా దిగడం కోసం 3.5 కిలోమీటర్ల మేర ఎయిర్‌స్ట్రిప్ నిర్మించారు. ఈ ఎయిర్‌స్ట్రిప్ ప్రారంభోత్సవంలో భాగంగానే ఇద్దరు మంత్రులు ఈ సాహసం చేశారు. బాడ్మేర్ నేషనల్ హైవే... ఐఏఎఫ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు వినియోగించే తొలి జాతీయ రహదారిగా అధికారులు పేర్కొన్నారు.
ల్యాండ్ అవుతున్న మంత్రుల విమానం ఎయిర్ స్ట్రిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ జాతీయ రహదారిపై ల్యాండ్ అయిన ఐఏఎఫ్ విమానం ఇంకా చాలా ప్రదేశాల్లో..
భారత ఆర్మీ కోసం ఈ అత్యవసర ల్యాండింగ్ వసతి రహదారులను ఉండే చాలా ప్రదేశాల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఏర్పాటు చేస్తోందని చెప్పారు రాజ్‌నాథ్.
"ఆర్మీ సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ భారత్‌లోని చాలా ప్రదేశాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తోంది. విపత్తుల వంటి సమయాల్లోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రదేశాలు ఉన్నందున... ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకైన భారత్ సిద్ధంగా ఉంటుంది."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి.
ఊహకందని ఇలాంటి ప్రాజెక్టుల ఆలోచన కార్యరూపం దాల్చే క్రమంలో ఎన్నో భయాందోళనలు తలెత్తాయని నితిన్ గడ్కరీ అన్నారు. కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో మూడు కిలోమీటర్ల ఈ ఎయిర్‌స్ట్రిప్ మార్గాన్ని ఎన్హెచ్ఐఏ విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. "ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించేందుకు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుందని ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా నాతో అన్నారు. కానీ, 17 రోజుల్లో, మంచి నాణ్యతతో కట్టి చూపిస్తామని నేను ఆయనతో చెప్పాను." అని గడ్కరీ తెలిపారు.
ఇదే తొలిసారి..
మరోవైపు.. బాడ్మేర్లో నిర్మించిన ఈ ఎయిర్‌స్ట్రిప్‌పై ఐఏఎఫ్‌కు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం, జాగ్వార్ యుద్ధ విమానాలను కూడా ల్యాండ్ చేశారు. ఈ యుద్ధ విమానాలు.. జాతీయ రహదారిపై దిగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐఏఎఫ్‌కు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూడా ఈ ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్ అయింది.
ఎయిర్ స్ట్రిప్ విశేషాలు...
- సత్తా-గంధవ్ మధ్య నిర్మించిన ఈ ఎయిర్ స్ట్రిప్‌ను జాతీయ రహదారి- 925ఏపై మూడు కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు.
- భారత వాయుసేన విమానాలు, ఇతర విమానాలు ల్యాండ్ అయ్యేలా దీన్ని నిర్మించారు.
- భారతమాల పరియోజన కింద రూ.765.52 కోట్లతో నిర్మించిన గంగరీయా-బఖాసర్, సత్తా-గంధవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ ఎయిర్‌స్ట్రిప్‌ను నిర్మించారు.
- ఈ ప్రాజెక్టులో భాగంగా మరో మూడు హెలిప్యాడ్లను కుందన్పుర, సింఘానియా, బాఖాసడ్ గ్రామాల్లో (100x30 మీటర్లు) నిర్మించారు.
- ఈ నిర్మాణాలను మూడేళ్ల వ్యవధిలో(2019 జులైలో ప్రారంభించిన దీన్ని, 2021 జనవరిలో) పూర్తి చేశారు.
- ఐఏఎఫ్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ)సారథ్యంలో జీహెచ్‌వీ ఇండియా లిమిటెడ్ వీటిని నిర్మించింది.
అంతకుముందు.. 2017, అక్టోబర్‌లో.. లఖ్‌నవూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఐఏఎఫ్‌కు చెందిన ఫైటర్ జెట్స్, ట్రాన్స్పోర్ట్ విమానాలు మాక్ ల్యాండింగ్ నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో అలాంటి రహదారులను ల్యాండింగ్ కోసం వినియోగించుకోగలమని చూపేందుకు ఈ ప్రయోగం చేపట్టారు అధికారులు.
ఇదీ చూడండి:భాజపా నేతపై దాడి.. ఎమ్మెల్యే సస్పెండ్