రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గొప్ప మనసు చాటుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో దత్తత తీసుకున్న ఓ యువకుడి పెళ్లి ఘనంగా జరిపించారు. పేద విద్యార్థిగా ఉన్న ఆ యువకుడి విద్యాభ్యాసానికి రాజ్నాథ్ సహకారం అందించారు. అతడు ప్రస్తుతం వైద్యుడిగా సేవలందిస్తున్నాడు. అతడి పెళ్లికి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు రాజ్నాథ్ సింగ్.
సైద్పుర్ గ్రామానికి వెళ్లి..
ఉత్తర్ప్రదేశ్ జిల్లా మదిరపుర్కు చెందిన బిజేంద్రకుమార్ 2000 ఏడాదిలో 8వ తరగతి పరీక్షల్లో టాపర్గా నిలిచాడు. ఆ సమయంలో తండ్రి మరణించడం వల్ల.. అతడి ఉన్నత చదువులకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న రాజ్నాథ్ సింగ్కు ఈ విషయం తెలిసింది. వెంటనే స్పందించి బిజేంద్ర కుమార్ విద్యాభ్యాసానికి సహకరించాడు. అప్పటి నుంచి బిజేంద్రకు అన్ని విధాల అండదండలు అందించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చినా బిజేంద్ర బాగోగులు పర్యవేక్షించారు రాజ్నాథ్. ఆయన సహకారంతోనే బిజేంద్ర ఎంబీబీఎస్ చదవి వైద్యుడయ్యాడు. బిజేంద్ర వివాహం అని తెలిసి రాజ్నాథ్ సింగ్.. ప్రత్యేకంగా యూపీలోని సైద్పుర్ గ్రామానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 20 ఏళ్ల తర్వాత.. రాజ్నాథ్ సింగ్ రావడం వల్ల బిజేంద్ర ఆనందం వ్యక్తం చేశాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ సింగ్.. తాను దత్తత తీసుకున్న ఓ పేద పిల్లవాడు ఉన్నత విద్యను అభ్యసించి.. గొప్పస్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.