అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)కు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని (ఎస్డీసీ) సోమవారం ప్రారంభించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిల్ఖువాలో అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మరింత చురుకుగా వ్యవహరించేలా సిబ్బందిని దిద్దితీర్చడం దాని ముఖ్య ఉద్దేశం.
"అగ్ని ప్రమాదాల్లో విలువైన ప్రాణాలతో పాటు ఆస్తిని కోల్పోతున్నాం. అది నిశ్శబ్ద మహమ్మారి కన్నా తక్కువేం కాదు. దానిని నివారించడంలో ఎస్డీసీ కీలక పాత్ర పోషిస్తుంది. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా అది సాధ్యపడుతుంది." అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
నైపుణ్యాల బలోపేతం..
ఈ కేంద్రంలో రక్షణ అగ్నిమాపక సిబ్బంది, డీఆర్డీఓ, కోస్ట్‌గార్డ్, ఇతర సాయుధ దళాల పోరాట యోధులకు నాణ్యమైన శిక్షణ ఇస్తారు. భూటాన్, శ్రీలంక సహా ఇతర పొరుగు దేశాలవారికీ ఇందులో శిక్షణ అందనుంది. ఈ కేంద్రాన్ని డీఆర్డీఓకు చెందిన ఫైర్, ఎక్స్‌ప్లోజివ్, పర్యవారణ కేంద్రం (సీఎఫ్ఈఈఎస్) నిర్వహిస్తుంది. అవగాహన పెంచడం, నైపుణ్యాల బలోపేతం ద్వారా ఎలాంటి వాతావరణంలో అయినా అగ్ని ప్రమాదాలను ఎదుర్కొని నష్ట తీవ్రతను తగ్గించేలా సిబ్బందిని సంసిద్ధం చేస్తారు.
దిగుమతులపై నిషేధం..
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మరికొన్ని రక్షణ పరికరాలపై నిషేధం పడనుంది. అందుకు సంబంధించిన జాబితాను మార్చిలో వెల్లడించనున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మరోవైపు ప్రైవేటు రంగం నుంచి రక్షణ పరికరాల సేకరణ 15 శాతానికే పరిమితం కాబోదని, మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ మంత్రి అన్నారు.
ఇదీ చూడండి:'ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో బలగాల మోహరింపు'