Rajiv Gandhi Assassination : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలవరించింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వం దోషులను విడుదల చేసేందుకు సుముఖత చూపడం, సోనియాగాంధీ కుటుంబం కూడా సానుకూలత చూపడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. తమిళనాడులోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశించింది.
తమను విడుదల చేయాలంటూ పలుమార్లు దోషులు నళిని శ్రీహరన్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జయకుమార్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని కీలక తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో దోషిగా ఉన్న పెరారివాలన్‌ను విడుదల చేస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలనే మిగిలిన ఆరుగురికి వర్తించేలా తీర్పు ఇచ్చింది.
తీర్పును స్వాగతిస్తున్నా..
రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులను విడుదల చేయాలన్న సుప్రీం తీర్పును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతించారు. ప్రజాతీర్పుతో ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను.. నియమిత స్థానాల్లో ఉన్న గవర్నర్లు రద్దు చేయకూడదనడానికి ఈ తీర్పు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ కారణాలతోనే ఆలస్యం..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై.. దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ తరఫు న్యాయవాది పి పుగళేంది స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు.. సంతోషించదగ్గ విషయమని అన్నారు. 2018లోనే తమిళనాడు కేబినెట్ ఏడుగురు దోషులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాజకీయ కారణాలతో వారి విడుదలను కేంద్రం అడ్డుకుందని వ్యాఖ్యానించారు.
సత్యం గెలిచింది..
రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు తీర్పుపై.. దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ తల్లి పద్మ హర్షం వ్యక్తంచేశారు. 'సంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. మా కుటుంబం మూడు దశాబ్దాలుగా పడుతున్న బాధ ఈ రోజుతో తీరింది. సత్యం గెలిచింది. న్యాయవ్యవస్థపై మా కుటుంబానికి ఉన్న విశ్వాసం ఈ తీర్పుతో అనేక రెట్లు పెరిగింది.' అని ఆమె అన్నారు.