Rajiv Gandhi Assassination : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన నళిని శ్రీహరన్ కీలక విషయాలు వెల్లడించారు. 2008లో వేలూరు సెంట్రల్ జైలులో తనను కలిసిన ప్రియాంక గాంధీ.. ఆమె తండ్రి రాజీవ్ హత్య గురించి పలు ప్రశ్నలు అడిగారని అన్నారు. ఆ సమయంలో ప్రియాంక భావోద్వేగానికి గురై ఏడ్చారని నళిని తెలిపారు. తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు నళిని శ్రీహరన్. రెండు నెలల గర్భవతి అయినప్పటికీ తనను జైలులో బంధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబమే తనకు తొలి ప్రాధాన్యం అని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో పలు విషయాలపై ఆదివారం నళిని మీడియాతో మాట్లాడారు.
"తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిక్ కలసి.. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు. ఆ కుటుంబాన్ని కలిసే అవకాశం దొరికితే వారిని కలిసేందుకు సిద్ధంగా ఉన్నా. సోమవారం తిరుచ్చి శరణార్థుల శిబిరంలో ఉన్న నా భర్త శ్రీహరన్ను కలుస్తా. నా కుమార్తె కూడా ఆయన్ను కలిసేందుకు ఉత్సాహంగా ఉంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చూడాలనుకుంటున్నా. నా భర్తను వీలైనంత త్వరగా శరణార్థుల శిబిరం నుంచి విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. రాజీవ్ హత్య కేసు నుంచి బయటపడేందుకు నాకు సహకరించిన వారందరినీ కలవాలనుకుంటున్నా."
--నళిని శ్రీహరన్