రెండేళ్ల క్రితం తమిళనాడులోని తూత్తుకుడి ఆందోళనల ఘటనపై సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఆయన చేసిన 'అసాంఘిక శక్తుల' వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 19న కమిషన్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
తూత్తుకుడిలోని వేదాంతా స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో రజనీకాంత్ స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. తన వ్యాఖ్యలపై రజనీని వివరణ కోరగా.. ఆయన సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అయితే 'ఎలా తెలిసిందో నన్ను అడగకండి.. నాకు అన్నీ తెలుసు' అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రజనీ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను మాత్రం వెనక్కి తీసుకోలేదు.