Rajinikanth Governor :తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. రాజకీయ ప్రవేశం గురించి గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం.. రజనీని కలిసిన ఒకరోజు తర్వాత తలైవా సోదరుడు సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
'అంతా దేవుడి చేతుల్లోనే'
Rajinikanth Brother Comments :రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు.. తమిళనాడు మధురై జిల్లాలోని రెండు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ సమయంలో విలేకరులు.. ఆయనను పలకరించి పలు ప్రశ్నలు వేశారు. రజనీకాంత్‌కు గవర్నర్ పదవి? వస్తుందా అని విలేకరులు అడిగారు. దీనికి ఆయన 'అంతా దేవుడి చేతుల్లోనే ఉంది. రజనీకి గవర్నర్ పదవి ఇష్టం లేదు. ఒకే వేళ ఇచ్చినా వద్దనరేమో!' అని అన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపారు. రజనీకాంత్‌ను ఓపీఎస్ మర్యాదపూర్వకంగానే కలిసి ఉంటారని.. రాజకీయ ప్రవేశం కోసం కాదని చెప్పారు.
రజనీని కలిసిన పన్నీర్ సెల్వం
OPS Meet Rajinikanth :అయితే శనివారం.. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. రజనీని ఆయన ఇంట్లో కలిశారు. ఆ తర్వాత తమ భేటీ గురించి ఓపీఎస్.. ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. "అనేక ఎత్తులను తాకి.. శాశ్వతంగా శిఖరాగ్రంలో నిలిచిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సమావేశం చాలా ఆనందంతోపాటు సంతృప్తిని కలిగించింది" అంటూ రాసుకొచ్చారు. మరోవైపు, ఓపీఎస్ కొత్త పార్టీ మొదలపెట్టనున్నట్లు తమిళ నాట ప్రచారం జరుగుతోంది.