దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం(Teachers day 2021) ఘనంగా నిర్వహించుకుంటోంది. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశిస్సులు తీసుకుంటున్నారు. కానీ, మధ్యప్రదేశ్, రాజ్‌గఢ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదైంది. ఇంతకి ఏం జరిగింది? ఆయన చేసిన తప్పేంటి?
రాజ్‌గఢ్ జిల్లాలోని మచల్పుర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు బాలికలు యూనిఫాం కాకుండా సివిల్ డ్రెస్‌లో వచ్చారు. అది ప్రధానోపాధ్యాయుడు రాధేశ్యామ్ మాలవియాకు నచ్చలేదు. విద్యార్థినులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగు బట్టలు ధరించిన విద్యార్థినులంతా.. సోమవారం నుంచి బట్టలు లేకుండా బడికి రావాలని ఆదేశించారు. సివిల్ డ్రెస్‌లో వచ్చి బాలురను చెడగొడుతున్నారని తిట్టారు. ఉపాధ్యాయుడి మాటలు విన్న విద్యార్థులు, మిగతా ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి గురయ్యారు.