రాజస్థాన్ బాడ్మేర్‌లోని పనోరియా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌కు గజేదాన్ చరణ్‌కు ఆదాయ పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. రూ.32.63 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినందుకు గాను.. రూ.4.89 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది.
ఈ అంశంపై చరణ్‌ను 'ఈటీవీ భారత్' ప్రశ్నించగా.. తన ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి ఎవరో ఒక సంస్థను నమోదు చేశారని వాపోయాడు. ఆ సంస్థ దిల్లీలో నడుస్తోందని తెలిపాడు. ఊరిలో ఆటో నడుపుతూ నెలకు రూ.10,000 సంపాదించే తనకు ఈ లావాదేవీల గురించి సమాచారం లేదని చెప్పాడు.
నేను ఒక ఆటో డ్రైవర్‌ను. అతి కష్టంమీద నేను నెలకు రూ.10,000 సంపాదిస్తాను. రూ.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించడం నాకు సాధ్యమేనా? ఈ మోసానికి సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాను. వారే ఈ అంశంపై దర్యాప్తు చేస్తారు. మోసగాళ్లతో పన్ను చెల్లించేలా చేస్తారు.