Rajasthan Road Accident Today : రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఓ ట్రక్కు.. ఆగి ఉన్న బస్సునుఢీకొట్టడం వల్ల బుధవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆర్బీఎం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీలో భద్రపరిచారు.
Bharatpur Road Accident :గుజరాత్‌లోని భావ్‌నగర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో మథురకు బస్సువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జైపుర్- ఆగ్రా హైవేపై హంతారా ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును లఖన్‌పుర్ ప్రాంతంలో ట్రక్కుఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులను అంతు, నంద్రం, లల్లూ, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందినవారని తెలిపారు.
దైవ దర్శనానికి వెళ్తుండగా!..
"గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన భక్తులు పుష్కర్‌లో దర్శనం చేసుకుని బస్సులో యూపీలోని మథురకు బయలుదేరారు. హంతారా సమీపంలో బస్సు టైరు పేలిపోయింది. దీంతో ప్రయాణికులు కొందరు బస్సు దిగగా.. మరికొందరు అందులోనే ఉన్నారు. అంతలో జైపుర్ వస్తున్న ఓ ట్రక్కు.. వెనుక నుంచి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టి 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంటనే అంబులెన్స్‌లు ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాం " అని ఏఎస్పీ లఖన్ సింగ్ తెలిపారు.