Rajasthan Road Accident : గుడికి వెళ్లి వస్తుండగా ఓ ట్రాక్టర్ అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆగుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నారు. రాజస్థాన్లో ఈ ఘటన జరిగింది. జుంజును జిల్లాలోని ఉదయపూర్వతి ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
సోమవారం స్థానికంగా ఓ కొండపై ఉన్న మన్సా మతా ఆలయంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పెద్ద ఎత్తున పుజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. దీంతో చుట్టుపక్క ప్రాంతాల భక్తులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. అనంతరం తిరిగి వెళుతుండగా.. సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారని వారు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గుడికి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు దూరం ఉందని స్థానికులు వెల్లడించారు. మొదట ట్రాక్టర్ అదుపుతప్పి ఉండవచ్చని, ఆ తర్వతా స్తంభానికి ఢీకొని లోయలో పడొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.