తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్ సంక్షోభం.. అధిష్ఠానం అలర్ట్.. పోటీ నుంచి గహ్లోత్​ను తప్పించాలని డిమాండ్! - రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం

Rajasthan politics: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభ నివారణకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది. సచిన్ పైలెట్ రాజస్థాన్‌ సీఎం కాకుడదనే లక్ష్యంతో గహ్లోత్ వర్గం అధిష్ఠానానికే షరతులు విధించిన నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు సీనియర్లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మంతనాలు జరుపుతున్నారు. సీనియర్ నేత కమల్‌నాథ్‌ను మధ్యవర్తిత్వం కోసం రాజస్థాన్ పంపాలని భావిస్తున్నారు.

RAJASTAN POLITICAL CRISIS
RAJASTAN POLITICAL CRISIS

By

Published : Sep 26, 2022, 4:56 PM IST

Rajasthan political crisis: రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేల వ్యవహారం చిచ్చురేపుతోంది. సచిన్ పైలట్​ను ముఖ్యమంత్రిని చేయకూడదని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ అధిష్ఠానం సంక్షోభ నివారణపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్​నాథ్​ను రంగంలోకి దించే అవకాశాలను పరిశీలిస్తోంది. తక్షణం దిల్లీకి రావాలని కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశించారు. గహ్లోత్ వర్గంతో ఆయన చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదేసమయంలో జైపుర్​లో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో సీనియర్ నేత మల్లికార్జన్ ఖర్గే సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో ఐకమత్యం అవసరమని గహ్లోత్‌తో భేటీ తర్వాత ఆయన చెప్పారు. పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని అభిలషించారు.

అశోక్‌ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మరొకరికి రాజస్థాన్‌ సీఎం పదవి కట్టబెట్టాలనే ఆలోచనను గహ్లోత్ వర్గం తిరస్కరిస్తోంది. ఈమేరకు 90మందికిపైగా గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు.. జైపూర్‌లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. అశోక్ గహ్లోత్‌ ఏఐసీసీ అధ్యక్షుడు అయితే.. కాంగ్రెస్ విధానం ప్రకారం 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అమలు చేయాలని సోనియా గాంధీ భావించారు. ఈ మేరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించేందుకు మల్లికార్జున ఖర్గేను పరిశీలకుడిగా నియమించి పంపారు.

సచిన్‌ పైలెట్‌ను.. రాజస్థాన్‌ సీఎం చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. స్పీకర్‌ వద్దకు వెళ్లి తమ రాజీనామా లేఖలను అందించారు. అయితే స్పీకర్ కార్యాలయం మాత్రం రాజీనామా లేఖలపై అధికారిక ప్రకటన చేయలేదు. చివరకు రాజస్థాన్‌ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్‌, ఏఐసీసీ పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రతాప్‌ కచారియవాస్, ఎస్‌ ధరివాల్, సీపీ జోషి.. మూడు డిమాండ్లు అధిష్ఠానం ముందు ఉంచారు.

'ఆ డిమాండ్లు సరికాదు'
రాజస్థాన్‌ సీఎంగా ఎవరు ఉండాలో అక్టోబరు 19 తర్వాత ఎన్నికయ్యే కాంగ్రెస్‌ అధ్యక్షుడికే వదిలిపెట్టాలని తొలి డిమాండ్ వినిపించారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రావాలని ఖర్గే, మాకెన్ కోరగా.. తాము బృందాలుగానే వస్తామని, తమ వాదన వినాలని పట్టుబట్టారు. అశోక్ గహ్లోత్‌ వర్గమైన 102 మంది ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపిక చేయాలని, సచిన్‌పైలెట్‌ వర్గాన్ని చేయరాదని మూడో షరతుగా విధించారు. అయితే, షరతులతో కూడిన తీర్మానం ఆమోదించడం సరికాదని తాము చెప్పినట్లు మాకెన్‌ వెల్లడించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్న తమ ప్రయత్నం నెరవేరలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు అధినేత్రి సోనియాకు నివేదిక ఇస్తామని చెప్పారు.

"షరతులతో కూడిన మూడు డిమాండ్లతో తీర్మానం చేయాలని వారు ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో షరతులతో కూడిన తీర్మానాలు ఎప్పుడూ చేయలేదు. ఏకవాక్య తీర్మానం ఉండాలి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు పెట్టే తీర్మానాన్ని కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాత తమ తీర్మానంపై తామే నిర్ణయం తీసుకోవడం అంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. అది సరికాదని నేను, మల్లికార్జున ఖర్గే చెప్పాం. ఒక్కొక్కరి అభిప్రాయాలను మేము కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వివరిస్తామని, అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పాం. ఈ మేరకు మా నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి నివేదిస్తాం."
-అజయ్ మాకెన్‌, కాంగ్రెస్‌ రాజస్థాన్‌ వ్యవహారాల బాధ్యుడు

'గహ్లోత్​ను తప్పించండి'
మరోవైపు, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణమైన.. అశోక్ గహ్లోత్‌ను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా చూడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గహ్లోత్‌ను తప్పించి పార్టీకి కట్టుబడి ఉండే మరో నేతను పోటీకి దింపాలని సూచిస్తున్నారు. ఈ మేరకు గహ్లోత్‌పై సోనియాగాంధీకి కొందరు సీడబ్ల్యూసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆయనపై విశ్వాసం ఉంచి.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని చెప్పినట్లు తెలిసింది. దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ వంటి.. సీనియర్ నాయకుల పేర్లు అధ్యక్ష పదవికి పరిశీలించాలని.. సోనియాను కోరినట్లు సమాచారం. పోటీకి సిద్ధమైన మరో సీనియర్ నేత శశిథరూర్‌ ఈ 30న... తన నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details