తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పార్టీ హైకమాండ్​ను ఛాలెంజ్ చేయను'.. సోనియాతో గహ్లోత్.. దిల్లీకి పైలట్ - రాజస్థాన్​ రాజకీయ సంక్షోభం

Rajasthan Political Crisis : రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో మాట్లాడారు. పార్టీ అధిష్ఠానాన్ని తాను ఎప్పుడూ ఛాలెంజ్ చేయనని తెలిపారు. మరోవైపు, సంక్షోభానికి కారణమైన ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని పార్టీ పరిశీలకులు.. సోనియాకు నివేదిక ఇచ్చారు.

Rajasthan Political Crisis
Rajasthan Political Crisis

By

Published : Sep 27, 2022, 8:48 PM IST

Updated : Sep 27, 2022, 10:11 PM IST

Rajasthan Political Crisis : రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన హైడ్రామా తర్వాత తొలిసారి సీఎం అశోక్‌ గహ్లోత్‌ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మాట్లాడారు. ఈ మేరకు ఆమెకు ఫోన్‌ చేసిన ఆయన... కాంగ్రెస్‌ హైకమాండ్‌ను తాను ఎప్పుడూ ఛాలెంజ్‌ చేయనని ఆమెతో చెప్పినట్టు సమాచారం. కాగా, గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో ఆయన నిలుస్తారా? లేదా అనే విషయంలో ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. పార్టీని ధిక్కరించేలా వ్యవహరించిన గహ్లోత్‌ను అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పించాలంటూ సీడబ్ల్యూసీ సభ్యుల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయితే, ఇందుకు పార్టీ అధిష్ఠానం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల విషయంలో తుది నిర్ణయం తీసుకొనే ముందు సోనియా గాంధీ కాంగ్రెస్‌ సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సీనియర్‌ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యే అవకాశం ఉంది.

సోనియాకు నివేదిక...
రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణమైన ముగ్గురు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్రం పరిశీలకులు అధినేత్రి సోనియాగాంధీకి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్‌ మాకెన్, మల్లికార్జున ఖర్గే... రాజస్థాన్ పరిణామాలపై సోనియాకు నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అనుచరులైన ఇద్దరు మంత్రులు శాంతి ధరివాల్‌, మహేశ్‌ జోషీ, ఎమ్మెల్యే ధర్మేంద్ర రాఠోడ్‌లపై చర్యలకు సిఫార్సు చేశారు. సంక్షోభానికి కారణమయ్యారని భావిస్తున్న... ముఖ్యమంత్రి గహ్లోత్‌పై మాత్రం ఎలాంటి చర్యలకూ సిఫార్సు చేయలేదు. కాగా, ఈ సిఫారసులపై కాంగ్రెస్‌ అధిష్ఠానం వెంటనే చర్యలు తీసుకుంది. ముగ్గురు నేతలకు నోటీసులు జారీ చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ యువనేత సచిన్‌ పైలెట్‌... దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన వ్యక్తిగతమని చెబుతుండగా.... ఇప్పటివరకు ఆయన పార్టీకి సంబంధించి ఎవరినీ కలవలేదు.

మరోవైపు, ఏఐసీసీ కోశాధికారి పవన్‌కుమార్‌ భన్సాల్‌ నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. అయితే ఇవి ఇతరుల కోసం అయి ఉంటుందని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌మిస్త్రీ తెలిపారు. దీనిపై స్పందించిన పవన్​ భన్సల్​.. తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నట్లు శశిథరూర్ ప్రతినిధులు సమాచారం ఇచ్చినట్లు మిస్త్రీ చెప్పారు.

ఆ వార్తలు అవాస్తవం:
మరోవైపు గహ్లోత్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే ఆయనను సీఎం పదవిలో కొనసాగించకూడదని యువనేత సచిన్‌ పైలట్ అధిష్ఠానానికి చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పైలట్‌ ఖండించారు. "ఇలాంటి అసత్య వార్తలు నన్ను భయపెడుతున్నాయి" అని ఆయన ట్వీట్‌ చేశారు. కాగా.. పైలట్ మంగళవారం​ దిల్లీ చేరుకున్నారు. అయితే, ఆయన పర్యటనకు సంబంధించి వివరాలు ఖరారు కాలేదు.

Last Updated : Sep 27, 2022, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details