Rajasthan New CM : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను ప్రకటించిన బీజేపీ, ఇప్పుడు రాజస్థాన్‌పై దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల్లో మాదిరిగా కొత్తవారికి అవకాశం ఇస్తుందా లేదా పాతవారికే మొగ్గు చూపుతుందా అనే విషయంపై ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరోవైపు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇంటికి కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లి కలవటం చర్చనీయాంశంగా మారింది. శాసనసభా పక్ష సమావేశానికి ముందు ఎమ్మెల్యేల కలవడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే ఎమ్మెల్యేలు వెళ్లి కలుస్తున్నంతమాత్రాన దానిని లాబీయింగ్‌గా చూడరాదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్, పార్టీ నేతలు సరోజ్‌పాండే, వినోద్ తావ్డేలకు బీజేపీ అప్పగించింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త ఎమ్మెల్యేలతో సమావేశమై కొత్త సీఎం పేరును ఆమోదించనున్నారు. సీఎంగా ఎవరిని నియమిస్తారా అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
సీఎం రేసులో ఎవరెవరు ఉన్నారంటే
మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీణాలతో పాటు, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, అశ్విన్ వైష్ణవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అన్న ఉత్కంఠ ఉంది.