Rajasthan New CM : రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మను ఎంపిక చేస్తూ భారతీయ జనతా పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనను పార్టీ శాసనసభాపక్ష నేతగా జైపుర్‌లో జరిగిన భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజేను కాదని పార్టీ అధిష్ఠానం భజన్‌లాల్ వైపు మొగ్గు చూపింది.
నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం మధ్యాహ్నం జైపుర్ సమావేశమయ్యారు. అధిష్ఠాన పరిశీలకులుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పార్టీ నేతలు సరోజ్ పాండే, వినోద్ తావ్డే హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం భజన్ లాల్(56) పేరును మాజీ సీఎం వసుంధర రాజే ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని అధిష్ఠానానికి తెలిపారు. నూతన ముఖ్యమంత్రికి పార్టీ అధిష్ఠానం శుభాకాంక్షలు తెలిపింది.
డిప్యూటీ సీఎంల పేర్లు ప్రకటన
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లాగానే రాజస్థాన్‌లో కూడా ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులను నియమించింది బీజేపీ. దియాకుమారి, ప్రేమ్ చంద్ భైరవను డిప్యూటీలుగా ఎంపిక చేసింది. అసెంబ్లీ స్పీకర్‌గా వాసుదేవ్ దేవ్నానిని ప్రకటించింది.
అయితే ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజేతో పాటు పలువురి పేర్లు వినిపించాయి. దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీణాలతో పాటు, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, అశ్విన్ వైష్ణవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరందరినీ కాకుండా సాంగానెర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన భజన్ లాల్ శర్మను ఎంపిక చేసింది బీజేపీ.
గవర్నర్ వద్దకు కొత్త సీఎం
రాజస్థాన్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన తర్వాత భజన్‌లాల్ శర్మ మీడియాతో మాట్లాడారు. "ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పేరును ప్రతిపాదించినందుకు మాజీ సీఎం వసుంధర రాజేకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని రాజస్థాన్ కొత్త సీఎం భజన్‌లాల్ శర్మ చెప్పారు. అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్‌ను భజన్‌లాల్ శర్మ కోరారు.
ఎవరీ భజన్‌లాల్?
బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నాలుగు సార్లు ఆయన ఈ పదవి చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో సంస్థాగతంగా కీలక వ్యవహరించిన భజన్‌లాల్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సాంగానెర్ నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 48వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. భజన్‌లాల్‌కు ఆర్ఎస్ఎస్తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఏబీవీపీ నేతగా వ్యవహరించారు. పీజీ పూర్తి చేసిన ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కూడా కొత్తవారికే ఛాన్స్
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో కూడా ముఖ్యమంత్రులగా కొత్త వారినే ప్రకటించింది బీజేపీ. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్సాయ్ని సీఎంగా నియమించింది. అలానే మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ, సీఎం రేసులో ఉన్న వారిని కాదని కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. నవంబర్ 25న 199 స్థానాలకు జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అధికార కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి పీఠాన్ని కైవసం చేసుకుంది.