Rajasthan High Court Parole: సాధారణంగా కోర్టు.. ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడం చూస్తూనే ఉంటాం. అయితే.. తల్లి కావాలన్న భార్య కోర్కెను తీర్చేందుకు ఓ ఖైదీకి పెరోల్ మంజూరు చేసింది రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పుర్ బెంచ్. దోషి భార్య వేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. తల్లి కావాలని ఆరాటపడుతున్న ఆమె కోరికను తిరస్కరించలేమని అభిప్రాయపడింది. అజ్మేర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 34 ఏళ్ల నంద్‌లాల్‌ను విడుదల చేయాలని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ పర్జాంద్ అలీ సభ్యులుగా గల డివిజన్ బెంచ్ ఆదేశించింది. రూ. 50 వేలతో వ్యక్తిగత పూచీకత్తు సహా రూ. 25 వేల చొప్పున రెండు ష్యూరిటీ బాండ్లు సమర్పించాలని ఖైదీకి స్పష్టం చేసింది.
అమాయకురాలైన ఖైదీ భార్య వైవాహిక జీవితం ప్రభావితం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. ఏ మహిళ అయినా తల్లి అయినప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుందని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. 16 మతకర్మలలో బిడ్డను కనడం మహిళకు మొదటి హక్కు అని నొక్కిచెప్పింది.
''దోషి భార్య తల్లి కావాలని కోరుకుంటోంది. తన భర్త లేకుండా, తన భర్త నుంచి ఎలాంటి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదు. ఆ మహిళ పిటిషన్‌ను తిరస్కరిస్తే ఆమె హక్కులను నిరాకరించినట్లే అవుతుంది. అందుకే.. నిందితుడికి 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తున్నాం.''