రాజస్థాన్ జైపుర్‌కు చెందిన ఓ యువతి చేసుకున్న వినూత్న వివాహం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. డిసెంబరు 8వ తేదీన జైపుర్, గోవింద్‌గఢ్‌లోని నర్సింగ్‌పురా గ్రామానికి చెందిన పూజా సింగ్(30) శ్రీకృష్ణుడ్ని వివాహమాడింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తన జీవితాన్ని కన్నయ్యకు అంకితం చేసింది.
ఈ వివాహానికి రూ.2.5లక్షలు ఖర్చు అయిందని పూజా సింగ్ తెలిపింది. సుమారు 300 మంది అతిథులు వేడుకకు వచ్చారని వెల్లడించింది. తనకు ఎన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా.. వాటన్నింటినీ తిరస్కరించానని చెప్పుకొచ్చింది. "నేను ఓ పూజారి ద్వారా తులసీ వివాహం గురించి తెలుసుకున్నాను. దీంతో శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా వివాహానికి గ్రామీణ నేపథ్యం ఉన్న చాలా మంది వ్యతిరేకించారు. అయితే నేను హిందూ మతాచారాల ప్రకారం ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. కాగా తులసి శాలిగ్రామ వివాహం మాదిరిగానే కన్నయ్యతో నా వివాహం జరిగింది" అని పూజా సింగ్ వివరించింది.