రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా బాడీబిల్డర్ అరుదైన ఘనత సాధించింది. రాష్ట్రంలోనే బంగారు పతకం సాధించిన మొదటి మహిళా బాడీబిల్డర్‌గా గుర్తింపు పొందింది. థాయ్‌లాండ్‌లో జరిగిన 39వ అంతర్జాతీయ మహిళల బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని.. భారత్‌కు బంగారు పతకం తెచ్చిపెట్టింది. అయితే.. ప్రస్తుతం సమాజం తాను సాధించిన విజయాన్ని కాకుండా.. వేసుకునే దుస్తుల గురించి కామెంట్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రియా సింగ్ థాయ్‌లాండ్ పట్టాయాలో జరిగిన ప్రపంచ మహిళల 39వ బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. అనంతరం పోటీలో వేసుకునే దుస్తుల్లోనే ఫోటోలు దిగింది. ఆమె టైటిల్ గెలిచాక కొందరు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం తన విజయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడతామని అన్నారు. అందుకుగాను బికినీలో ఉండే ఫొటోలు కాకుండా సాధారణ డ్రస్‌లో ఉండే చిత్రాలు కావాలని కోరారు. వారు అలా కోరడంపై ప్రియా సింగ్ విచారం వ్యక్తం చేసింది.
"బికినీపై ఎందుకు ప్రశ్నలు? బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనాలి అంటే బికినీ వేసుకోవాలి. ఏ ఆటగాడు అయినా తగిన దుస్తులు ధరించి వేదికపైకి వెళ్తాడు. గెలిచాక కూడా అదే డ్రస్‌తో ఫోటోలు దిగితారు. పూర్తిగా వస్త్రాలు ధరిస్తే బాడీబిల్డర్ శరీరం ఎలా కనిపిస్తుంది? అక్కడ బికినీ అనేది తప్పనిసరి. నేను టైటిల్ గెలిచిన తర్వాత కొందరు ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు. నా ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని.. దానికి బికినీలో ఉన్న ఫొటోలు కాకుండా సాధారణ డ్రస్‌లో ఉండే చిత్రాలు కావాలని కోరారు. అయితే ఓ మహిళా పోలీసు తన అత్తామామలు, కుటుంబసభ్యులు చూస్తున్నారని యూనిఫాంలో కాకుండా.. తన డ్రస్ మార్చుకుంటుందా? నా రంగంలో నాకు బికినీ అన్నది యూనిఫాం లాంటిదే. ఆ డ్రస్‌తోనే నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తాను. ఇలాంటి విషయాల్లో సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది".
--ప్రియా సింగ్ మేఘవాల్, రాజస్థాన్ మొదటి మహిళా బాడీబిల్డర్