Rajasthan Elections 2023 :దేశంలో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్ 23న ఒకే విడతలో రాజస్థాన్‌లో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్‌లో ఈసారి తమదే అధికారమని ప్రతిపక్ష బీజేపీ చెబుతోంది. మరోవైపు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మళ్లీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితేంటి? 2018లో ఎవరెన్ని గెలిచారంటే?
2018 ఎన్నికల ఫలితాలు ఇలా..
- అధికార కూటమి
- కాంగ్రెస్-108
- రాష్ట్రీయ లోక్ దళ్- 1
- స్వతంత్రులు- 13
- ప్రతిపక్షాలు
- భారతీయ జనతా పార్టీ - 70
- రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ- 3
- భారతీయ గిరిజన పార్టీ- 2
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా- 2
- ఖాళీలు-1
Rajasthan Election 2018 Results : రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా.. కాంగ్రెస్‌కు 108, మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి ఒక సీటు ఉంది. 12 మంది స్వతంత్రులు సైతం అధికార పక్షానికి మద్దతుగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి 70 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీకి 2024 జనవరి 17 వరకు గడువు ఉంది.
రాజస్థాన్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోగా.. బీఎస్పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ఇలా.. బీజేపీ అలా..
Rajasthan Elections 2023 Notification : రాష్ట్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బిహార్‌లో కులగణన తర్వాత.. తమ రాష్ట్రంలోనూ కుల గణన నిర్వహించేందుకు అశోక్ గహ్లోత్ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 14 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే రాజస్థాన్‌లో బీజేపీని ఓడించగలమని సచిన్ పైలట్ ఇటీవలే అభిప్రాయపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా ఐకమత్యంగా పోరాడి, అధికారం మరోసారి చేజిక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య ఉన్న అంతర్గత పోరును పూర్తిగా అధిష్ఠానం పరిష్కరిస్తే కాంగ్రెస్‌కు గెలుపు కష్టం కాకపోవచ్చు.
మరోవైపు, ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్‌లో వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనంటున్న బీజేపీ కూడా కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాజస్థాన్ నాయకత్వంతో మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. కీలక నాయకులంతా కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సహా కొందరు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అంశాలెంటో ఇప్పుడు చూద్దాం..
- ప్రజా వ్యతిరేకత
1993 తర్వాత ప్రతిసారీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అధికారం మారుతూ వచ్చింది. ఇదే సెటిమెంట్ కొనసాగితే.. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకతతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. - గ్రూపు తగాదాలు
కాంగ్రెస్ నేతలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్.. తమ విభేదాలు పక్కనపెట్టి పని చేస్తే గెలిచే అవకాశం ఉంది. బీజేపీ సైతం మాజీ సీఎం వసుంధర రాజే వర్గం నేతలను విస్మరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. - ఓపీఎస్ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలు
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది అధికార కాంగ్రెస్. ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. - శాంతి భద్రతలు
అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ ఆరోపిస్తోంది. మహిళపై జరిగిన నేరాలను ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. - తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్
తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ జాతీయ హోదాపై కాంగ్రెస్ పోరాడుతోంది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ వెనక్కి తగ్గడం వల్ల దీనిని అదునుగా తీసుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. - మత ఘర్షణలు
రాష్ట్రంలో మత ఘర్షణలు ఎక్కువయ్యాయంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఉదయ్పుర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యను ప్రధాని మోదీ సైతం తన ప్రచారంలో ప్రస్తావించారు. - పేపర్ లీక్స్
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పేపర్ల లీక్‌ను బీజేపీ ప్రధాన అస్త్రంగా వినియోగించుకోనుంది. అనేక మంది నిరుద్యోగులను ప్రభావితం చేసే ప్రణాళికలు రచిస్తోంది. - రైతు రుణమాఫీ
రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. - టీచర్ల బదిలీలు
సుమారు లక్ష మంది గ్రేడ్ 3 ఉపాధ్యాయులు బదిలీలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న పోలింగ్.. బీజేపీ X కాంగ్రెస్ సంగ్రామంలో విజేత ఎవరో?
BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్.. ఆ రాష్ట్రాలో విజయమే టార్గెట్.. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంపీలు