Rajasthan Election BJP Manifesto : రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక హామీలతో మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. 'సంకల్ప్ పత్ర' పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం జయపురలో ఆవిష్కరించారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే మహిళలు, నిరుద్యోగులు, రైతుల కోసం ఏం చేయనున్నారో వెల్లడించారు జేపీ నడ్డా. తాము అధికారంలోకి రాగానే ప్రశ్నపత్రాల లీకేజీపైనా, కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేస్తామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 సబ్సిడీ
- 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
- రాష్ట్రంలోని జిల్లాకొక మహిళా పోలీస్ ఠాణా
- ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా డెస్క్
- ప్రతి పట్టణంలో యాంటీ రోమియే స్క్వాడ్ నియామకం
- 'లఖపతి దీదీ' పథకం కింద 6లక్షల గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ
- 12వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీ
- కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య
- 'లడో ప్రోత్సాహన్ యోజన' కింద ఆడపిల్ల పుడితే రూ.2 లక్షల సేవింగ్స్ బాండ్
- రైతులకు గోధుమలపై క్వింటాల్‌కు రూ.2700 బోనస్
- వేలం వేసిన రైతుల భూములకు పరిహారం
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సహాయాన్ని రూ.12,000కి పెంపు
- తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ (ఈఆర్‌సీపీ) సకాలంలో పూర్తి
- ప్రధానమంత్రి మాతృ వందన్ పథక ఆర్థిక సహాయం రూ.5,000 నుంచి రూ.8,000కు పెంపు
- హెల్త్ డిపార్ట్మెంట్లో రూ.40వేల కోట్ల పెట్టుబడి
- 15వేల మంది వైద్యులు, 20వేల మంది పారామెడికల్ సిబ్బంది నియామకం
- దివ్యాంగులకు నెలకు రూ.1500 పింఛను, వృద్ధాప్య పెన్షన్ పెంపు