Rajasthan Election 2023 :రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 199 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. 5.26 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల కోసం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దించారు.
రాష్ట్రంలో 51 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 10,501 గ్రామీణ ప్రాంతాల్లో 41,006 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది. 26 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయనున్నారు. దీంతో పాటు ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేలా చూసేందుకు 6287 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 2.74 లక్షల మంది పోలింగ్ సిబ్బంది.. ఎన్నికల విధుల్లో భాగం కానున్నట్లు తెలిపారు.
పటిష్ఠ భద్రత
శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా లక్షా 70 వేల మంది భద్రతా సిబ్బందిని రాజస్థాన్‌లో మోహరించారు. ఎన్నికల విధుల కోసం 700 కంపెనీల బలగాలను రంగంలోకి దించారు. 70 వేల మంది రాజస్థాన్ పోలీసులకు తోడు.. 18 వేల మంది హోంగార్డులు, 2వేల మంది సరిహద్దు హోంగార్డులు, 15 వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎన్నికల విధుల కోసం మోహరించారు. కేంద్ర పారామిలిటరీ దళాలు, ఇతర రాష్ట్రాల సాయుధ దళాలను సైతం రాష్ట్రంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.