Rajasthan Election 2023 :రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 6గంటలకు రాజకీయ పార్టీల ప్రచారానికి బ్రేక్ పడింది. రాజస్థాన్‌లో 200 స్థానాలు ఉన్నప్పటికీ.. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ మృతి చెందటంతో 199 నియోజకవర్గాలకే ఈనెల 25 ఓటింగ్ జరగనుంది. 5 కోట్ల 25లక్షల 38వేల నూటా ఐదు మంది ఓటర్లు ఉన్నారు. వచ్చేనెల3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఐదేళ్ల అభివృద్ధిపై కాంగ్రెస్ ఆశలు
రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకోవాలని అధికార కాంగ్రెస్.. తిరిగి పాగా వేయాలని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీలు హోరాహోరీగాప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ తదితరులు ప్రచారం చేశారు. ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని హస్తం నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఏడు ఉచిత హామీలు, ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అంశాలు తమను మళ్లీ గెలుపు తీరాలకు చేరుస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. ఇత్యాది సానుకూల అంశాలతో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయానికి బ్రేక్ వేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతే మమ్మల్నిగెలిపిస్తుంది: BJP
భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎంలు శివరాజ్‌సింగ్, యోగీ ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం చేశారు. మహిళలపై అత్యాచారాలు, పరీక్ష పేపర్ల లీకేజీ అంశాలను కమలనాథులు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. గహ్లోత్ సర్కార్‌పై వ్యతిరేకత, మోదీ ఛరిష్మా తమకు కలిసి వస్తాయనే విశ్వాసంతో BJP శ్రేణులు ఉన్నారు.