Rajasthan cylinder subsidy : రాష్ట్రంలోని 14 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఇందిరా గాంధీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్ కింద.. సోమవారమే సిలిండర్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక్కో సిలిండర్‌పై రూ.640 సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలో తాను ఇచ్చిన హామీకి అనుగుణంగా తాజా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వాస్తవానికి.. రాష్ట్రంలో 80 లక్షల కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని గహ్లోత్ పేర్కొన్నారు. అయితే.. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన గణాంకాలు రాలేదని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం అర్హులను గుర్తించి, ప్రస్తుతానికి 14 లక్షల కుటుంబాలకు సిలిండర్ సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పించారు గహ్లోత్. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడేందుకు విపక్షాల వద్ద ఏమీ లేదని గహ్లోత్ చెప్పారు. తాము ప్రవేశపెట్టిన పథకాలు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాదని, శాశ్వతంగా ఉంటాయని అన్నారు. మోదీ అహంకారం, మొండి పట్టుదల వల్లే ఇటీవల హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.
"ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని అప్పటి హిమాచల్ సీఎం.. మోదీకి సూచించారు. కానీ మోదీ మొండిపట్టు పట్టి అందుకు ఓకే చెప్పలేదు. ప్రజాస్వామ్యంలో ఎవరి అహంకారం పనిచేయదు. ప్రజాస్వామ్యంలో మొండితనానికి తావు లేదు. ప్రతి ఒక్కరూ ఓటర్లకు తలవంచాల్సిందే. త్వరలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఓటమిపాలవుతుంది."
-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం