వివిధ రాష్ట్రాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇటీవలే పంజాబ్ సమస్యకు స్వస్తి పలికిన అధిష్ఠానం ఇప్పుడు రాజస్థాన్‌లోనూ రాజీకి యత్నిస్తోంది. ఈ మేరకు ఆదివారం.. పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనుంది. గతంలో తిరుగుబాటు చేసి చల్లబడిన సచిన్ పైలట్ వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య విభేదాలున్న విషయం విదితమే.
కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ
ఈ మేరకు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే అధిష్ఠానం తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్, రాజస్థాన్ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ శనివారం జైపుర్ చేరుకున్నారు. నేరుగా సీఎం అశోక్ గహ్లోత్ నివాసానికి వెళ్లిన వారు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 27 లేదా 28న క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.