అంతగా చరిత్రపుటలకెక్కని ఆ సుదీర్ఘ రైతుపోరు రాజస్థాన్‌లోని బిజోలియాలో (Rajasthan Bijoliya kisan andolan) జరిగింది. మొత్తం మూడు దశల్లో.. (1897-1915; 1916-1923; 1923-1941) సాగిన ఈ ఉద్యమానికి సాధు సీతారాందాస్, విజయ్‌సింగ్ పాథిక్, మాణిక్యలాల్ వర్మ తదితరులు సారథ్యం వహించారు. రాజస్థాన్ మేవాడ్ సంస్థానంలోనిదీ బిజోలియా (Rajasthan Farmers protest) ప్రాంతం. అక్కడ 62శాతం భూమి జాగీర్దార్‌ల చేతుల్లోనే ఉండేది. వీరంతా తలచుకుంటే... తన ప్రాణాలకూ ముప్పుందని మేవాడ్ రాజు సైతం భయపడేంత బలమైనవారు ఈ జాగీర్దార్‌లు. అలాంటి వారిపై రైతులు బయటి నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా తిరుగుబాటు (Bijoliya kisan andolan) చేశారు.
బిజోలియా ఎస్టేట్‌లో మొత్తం 83 గ్రామాలుండేవి. రైతుల జీవితాలన్నీ భూస్వాములు, జాగీర్దార్‌ల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వారు చెప్పిందే చట్టం. పండించే పంటలో దాదాపు సగం దాకా శిస్తు కింద జమచేసుకునేవారు. దీనికి అదనంగా 86 రకాల పన్నులు కట్టించుకునేవారు. ఎలాంటి కూలి ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. ప్రతి పండగకూ పబ్బానికీ రైతులు భూస్వామికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. జాగీర్దార్ ఇంట్లో శుభకార్యమైనా, అశుభకార్యమైనా రైతుల నుంచి డబ్బులు గుంజేవారు. ఈ శిస్తులు కట్టనివారిని వేధించి, బహిరంగంగా శిక్షించేవారు. ఇలా తమ జీవితాలు పూర్తిగా చాకిరీ-పన్నుల మధ్య నలుగుతుండటంతో... రైతులంతా ఓ రోజు కలసికట్టుగా (Bijoliya kisan andolan) మేవాడ్ రాజు మహా రాణా ఫతేసింగ్‌ను కలసి విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నారు. జాగిర్దార్‌లకు భయపడి... ఈ రైతులను కలవటానికి ఆయన ఆరునెలల పాటు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు రైతుల ఒత్తిడి మేరకు... ఓ అధికారితో విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా.. కొన్ని పన్నులను తొలగించాలని జాగీర్దార్‌లకు సూచించారు.
పెళ్లి చేసినా పన్ను...
సరేనన్న జాగీర్దార్‌లు... తాయిలాలు ఇచ్చి కొంతమంది రైతులను తమవైపు తిప్పుకొన్నారు. అన్నదాతల్లో విభజన తీసుకురావటానికి ప్రయత్నించారు. కానీ రైతులు వంచకులను వెలివేసి తాము మాత్రం గట్టిగా నిలిచారు. ఇంతలో జాగీర్దార్‌లు చన్వారీ పేరుతో కొత్త పన్ను విధించారు. ఎవరైనా రైతు తమ బిడ్డకు పెళ్లి చేస్తే రూ.5 పన్నుగా చెల్లించాలి. దీన్ని వ్యతిరేకించిన రైతులు... రెండేళ్లపాటు తమ పిల్లలకు పెళ్లిళ్లే చెయ్యలేదు. 1905లో పోరాటం తీవ్రమైంది. జాగీర్దార్‌ల భూముల్లో పనిచేయొద్దని నిర్ణయించారంతా. దీంతో దిగివచ్చిన భూస్వాములు... చన్వారీ పన్ను రద్దు చేశారు. పంటలో వాటాపైనా పరిమితి విధించారు. కానీ తొలి ప్రపంచయుద్ధం ఆరంభంతో... మరిన్ని పన్నులు వేశారు.