- 05.22 PM
"ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై రాజస్థాన్ ప్రజలు తమ విశ్వాసాన్ని చూపించారు. బీజేపీకి సంపూర్ణ విజయం ఇచ్చినందుకు మేము ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీజోషి చెప్పారు.
- 05.03 PM
రాజస్థాన్‌లో బీజేపీ విజయంపై ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. "ప్రజల అభిప్రాయాన్ని అంగీకరిస్తున్నా. కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని ఆశిస్తున్నా. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు షాకింగ్‌గా ఉన్నాయి" అని చెప్పారు.
- 04.28 PM
రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 101ను సొంతం చేసుకుంది. మరో 15 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ 61 స్థానాల్లో గెలిచింది. మరోవైపు, జయపురలో మంగళవారం శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా తెలిపారు.
- 04.02 PM
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్.. ఆదివారం సాయంత్రం గవర్నర్‌కు తన రాజీనామాను అందజేయనున్నారు.
- 02.47 PM
రాజస్థాన్‌లో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తున్న వేళ ఆ పార్టీ అగ్ర నాయకురాలు వసుంధర రాజే స్పందించారు. "ఈ విజయం వెనుక ప్రధాని మోదీ ఇచ్చిన 'సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' మంత్రం ఉంది. అమిత్ షా వ్యూహం, నడ్డా సమర్థవంతమైన నాయకత్వం కూడా తోడైంది. ఇది ముఖ్యంగా పార్టీ కార్యకర్తల విజయం" అని తెలిపారు. వసుంధర రాజే 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. - 02.27 PM
రాజస్థాన్‌లో (మొత్తం 199 స్థానాలు) బీజేపీ 29 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. మరో 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్ 17 చోట్ల గెలిచి.. మరో 54 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచి.. మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేతలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ విజయం సాధించారు. బీజేపీ నేతలు వసుంధర రాజే, దియా కుమారి కూడా గెలుపొందారు. - 01.23 PM
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే 40వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికి బీజేపీ 7 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. - 12.38 PM
రాజస్థాన్‌లో బీజేపీ తన హవా కనబరుస్తోంది. మెజార్టీ మార్క్‌ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రెండు సీట్లలో బీజేపీ విజయం సాధించింది. - 11.45 AM
పుంజుకున్న సచిన్ పైలట్
టోంక్ స్థానం నుంచి తొలుత వెనకబడ్డ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్రమంగా పుంజుకున్నారు. తన సమీప అభ్యర్థి, బీజేపీ నేత అజిత్ సింగ్ మెహతాపై ఆధిక్యంతో కొనసాగుతున్నారు. - 10.40AM
వసుంధర, గహ్లోత్ ఆధిక్యం
రాజస్థాన్‌లో బీజేపీ దూసుకెళ్తోంది. ఝాల్రాపాటన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజస్థాన్ బీజేపీ అగ్రనేత వసుంధర రాజె ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రస్తుత సీఎం అశోక్ గహ్లోత్ సర్దార్పుర్ స్థానం నుంచి లీడింగ్‌లో ఉన్నారు. సచిన్ పైలట్ మాత్రం వెనుకంజలో ఉన్నారు. - 9.50AM
రాజస్థాన్‌లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. లీడింగ్‌లో ఉన్న స్థానాల సంఖ్య వంద దాటింది. కాంగ్రెస్ 60కి పైగా స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. - 9.40AM
రాజస్థాన్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కాంగ్రెస్ కాస్త వెనకంజలో ఉంది. 10కి పైగా స్థానాల్లో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. టోంక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ వెనకంజలో ఉన్నారు. 4 వేలకు పైగా ఓట్లతో ఆయన వెనకబడ్డారు. - 9.00AM
రాజస్థాన్‌లో బీజేపీ 41 సీట్లలో ముందంజలో ఉంది. 32 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఇతరులు నాలుగు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. - 8.30AM
రాజస్థాన్‌లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 13 స్థానాల్లో బీజేపీ, 9 సీట్లలో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉన్నాయి. - 8.00 AM
Rajasthan Assembly Election Result 2023 in Telugu :రాజస్థాన్‌లో బీజేపీకి అధికారమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఐదేళ్లకోసారి అధికారం మార్పిడి సంప్రదాయాన్ని తిరగరాస్తామన్న కాంగ్రెస్ ధీమా మధ్య అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గతనెల 25వ తేదీన ఓటింగ్ జరిగిన 199 స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.