Rajasthan Assembly Election 2023 Results in Telugu :రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ జోరు కనబరుస్తోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అధికారం చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. మరోవైపు, ఫలితాల్లో కాంగ్రెస్ డీలా పడింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు.
వసుంధర టాప్- పుంజుకున్న పైలట్
ఝాల్రాపాటన్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న రాజస్థాన్ బీజేపీ అగ్రనేత వసుంధర రాజె ఆధిక్యం కనబరుస్తున్నారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌లాల్ చౌహాన్‌పై భారీ తేడాతో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. మరోవైపు, టోంక్ స్థానం నుంచి తొలుత వెనకబడ్డ కాంగ్రెస్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ క్రమంగా పుంజుకున్నారు. తన సమీప అభ్యర్థి, బీజేపీ నేత అజిత్ సింగ్ మెహతాపై ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధిక్యంలో ఉన్నారు. సర్దార్పుర్ నుంచి ఆయన పోటీ చేశారు.
రాజస్థాన్ యోగి లీడింగ్
వసుంధర రాజెకు పోటీగా బరిలోకి దించినట్లు భావిస్తున్న బీజేపీ నేత దియా కుమారి లీడింగ్‌లో ఉన్నారు. విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై ఆధిక్యం కనబరుస్తున్నారు. 'రాజస్థాన్ యోగి ఆదిత్యనాథ్'గా పిలుస్తున్న బాబా బాలక్‌నాథ్ సైతం లీడింగ్‌లో కొనసాగుతున్నారు. తిజారా స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు.