Rains In South Tamilnadu :తమిళనాడు దక్షిణ జిల్లాల్లో కురిసిన వర్షాల వల్ల పోటెత్తిన వరదలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. తూతుకూడి నగరం దాదాపు నీట మునిగింది. జాతీయ రహదారిపైనా నీరు చేరింది. నీట మునిగిన ఇళ్ల నుంచి వంట సామాన్లు మాత్రమే తీసుకుని ప్రజలు రోడ్లపైకి చేరుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
హెలికాఫ్టర్ల సాయంతో సహాయక చర్యలు
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు పరిస్థితులు అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక ఫోర్స్ రంగంలోకి దిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయక చర్యలు నిర్విరామంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే హెలికాఫ్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, వైమానికదళం, రైల్వే, స్థానిక అధికారులతో కలిసి శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌లోనే చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
స్టేషన్‌లో చిక్కుకుపోయిన వారిలో 300 మందిని దగ్గరలోని ఒక పాఠశాలలో, మిగిలిన వారిని రైల్వే స్టేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్లో ఒక చిన్నారి, గర్భిణీ సహా అనేక మంది ప్రయాణికుల ప్రాణాలను హెలికాఫ్టర్‌ల సాయంతో రక్షించగలిగాయి రక్షణ దళాలు. ఇక శ్రీవైకుంఠంకు 38కి.మీ దూరంలో ఉన్న ఉన్న వంచి మాణియాచ్చి రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్లే వారికోసం సైతం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ.
తిరునల్వేలిలో అనేక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను బోట్ల సాయంతో పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. విపత్తు నిర్వహణ దళం, పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసాయం అందిస్తోంది. తమిళనాడు దక్షిణాది జిల్లాల్లో సహాయ చర్యల కోసం మొత్తం 200 బోట్లను ఉపయోగిస్తున్నారు.