IMD Monsoon start date 2023 : నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. ఆదివారం కేరళకు చేరాల్సిన రుతు పవనాలు మరో మూడునాలుగు రోజులు ఆలస్యం కానున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
సాధారణంగా జూన్ ఒకటో తేదీకి రుతుపవనాలు కేరళకు చేరుతాయి. అయితే ఈసారి కాస్త ఆలస్యంగా నాలుగో తేదీకి చేరుతాయని వాతావరణ విభాగం మొదట అంచనా వేసింది. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమగాలులు పెరిగనందున రుతుపవనాల కదలికకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది. ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘావర్తనం పెరుగుతున్నందున వచ్చే మూడునాలుగు రోజుల్లో రుతు పవనాలు కేరళను చేరటానికి అనుకూల పరిస్థితులు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. అయితే రుతు పవనాల రాక ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌తోపాటు దేశవ్యాప్త వర్షపాతంపై ప్రభావం ఉండబోదని అధికారులు చెప్పారు.
IMD Monsoon start date 2023 : ఆగ్నేయ రుతుపవనాలు గత ఏడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న దక్షిణాది రాష్ట్రానికి చేరుకున్నాయి. భారత్‌లోకి భూభాగంపై తొలుత కేరళలో ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి.
ఐఎండీ అంచనాల ప్రకారం..
- భారత్‌లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
- తూర్పు భారతం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది.
- వర్షాకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చు. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చు.
Rain Importance In Agriculture : భారతదేశ వ్యవసాయానికి సాధారణ వర్షపాతం కీలకం. మొత్తం సాగు విస్తీర్ణంలో 52 శాతం సాధారణ వర్షపాతంపైనే ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తితో పాటు రిజర్వాయర్ల భర్తీకి కూడా ఇది కీలకం. దేశంలో వర్షాధార వ్యవసాయం 40 శాతం వాటాను కలిగి ఉంది.
IMD Skymet Weather : రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం చేసే భారత్‌కు.. కొన్ని రోజుల క్రితం ఐఎండీ ప్రకటించిన అంచనాలు కాస్త ఉపశమనం కలిగించాయి. భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. అయితే భారత్‌లో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ ఏప్రిల్ 10న ప్రకటించింది. కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త విరుద్ధంగా.. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.