తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెంగళూరు హోటళ్లలో రూమ్‌ ధర రూ. 40వేలు.. ఫుల్​ బుకింగ్స్​.. వర్షాలే కారణం

Bengaluru Rains : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బెంగళూరు సహా పలు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. చాలా ప్రాంతాల ప్రజలు హోటళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతున్నాయి.

Bengaluru Rains
బెంగళూరు వరదలు

By

Published : Sep 8, 2022, 9:59 PM IST

కర్ణాటకలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగళూరు నగరం సహా పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న ఈ భారీ వానలకు కాలనీల్లోకి, ఇళ్లల్లోకి వరదనీరు పోటెత్తుతుండటం వల్ల జనజీవనం అతలాకుతలమైంది. గత కొన్ని రోజులుగా వర్షం పడుతుండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు, వరదలు ముంచెత్తడం వల్ల బెంగళూరులో హోటళ్లలో గదుల టారిఫ్‌లు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ హబ్‌లో వరదలు, నీటి ఎద్దడి కారణంగా అనేక కుటుంబాలు హోటళ్లకు మకాం మార్చమే ఈ డిమాండ్‌కు కారణం. పాత విమానాశ్రయం రోడ్డులోని ఎల్‌బీ శాస్త్రినగర్‌లో చాలా అపార్ట్‌మెంట్లకు నీటి సరఫరా, విద్యుత్తు నిలిచిపోవడంతో వారంతా హోటళ్లలో తలదాచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో హోటళ్ల టారిఫ్‌లు పెరిగిపోయాయి. సాధారణంగా రూ.10వేల నుంచి 20వేల మధ్య ఉన్న ఈ ధరలు తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఒక రాత్రికి రూ.30 వేలు నుంచి 40వేల వరకు పలుకుతున్నట్టు సమాచారం. వరదలకు దెబ్బతిన్న వైట్‌ఫీల్డ్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఓల్డ్‌ ఎయిర్‌ పోర్టు రోడ్డు, కోరమంగళ తదితర ప్రాంతాల్లోని అనేక హోటళ్లలో శుక్రవారం వరకు గదులన్నీ బుక్‌ అయిపోయినట్టు తెలుస్తోంది.

బెంగళూరు వరదలు

పాత విమానాశ్రయం రోడ్డులోని లీలా ప్యాలస్‌లో ప్రస్తుతం ఒక గదికి ప్రారంభ ధర రూ.18,113గా ఉండగా.. మరోవైపు, తాజ్ బెంగళూరులో డీలక్స్ గది బుకింగ్‌ కోసం రూ. రూ.14,750 (పన్నులు మినహాయించి) చెల్లించాల్సి వస్తోంది. అయితే, బెంగళూరులోని ఓయో గదుల ధరలు అక్కడి ప్రజలకు సరసమైనవిగా లభ్యమవుతున్నాయి. వీటి ధరలు రూ.1200ల కన్నా కాస్త ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

బెంగళూరు వరదలు

మలప్రభ నదిలో కొట్టుకుపోయిన రైతు : రాష్ట్రంలో కురుస్తోన్న ఈ భారీ వర్షాలకు వ్యవసాయ పంటలతో పాటు అనేక ఇళ్లు, వంతెనలు ముంపునకు గురయ్యాయి. బాగల్‌కోట్‌ జిల్లాలోని మలప్రభ నదిలో ఓ రైతు కొట్టుకుపోగా.. బళ్లారి జిల్లాలో గోడ కూలడంతో ఓ మహిళ ప్రాణాలు విడిచారు. అనేక మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ధార్వాడ్‌, చిత్రదుర్గ, విజయపుర, బళ్లారి, హవేరి, విజయనగర, హసన్‌ , కొడగు, చిక్కబళ్లాపుర, కోలార్‌, చామరాజనగర, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో పలు నదులు పొంగి ప్రవహిస్తుండటంతో భారీగా పంటలతో పాటు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, హోమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్‌ కుమార్‌ సారథ్యంలోని కేంద్ర బృందం కర్ణాటకలో పర్యటిస్తోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనుంది.

ఇవీ చదవండి:'కర్తవ్యపథ్​'ను ప్రారంభించిన మోదీ.. నేతాజీ విగ్రహావిష్కరణ

ప్రయాణికుడిపై కండక్టర్ దాడి.. కాలితో ఛాతీపై తన్ని..

ABOUT THE AUTHOR

...view details