Rain In Delhi Improves AQI : వారం రోజులకు పైగా తీవ్రమైన వాయు కాలుష్యంతో అల్లాడిన దిల్లీవాసులకు కాస్త ఊరట లభించింది. గురువారం అర్ధరాత్రి తర్వాతి నుంచి నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో వాతావరణం మెరుగైంది. దిల్లీ- నోయిడా ప్రాంతంతో పాటు కర్తవ్యపథ్, ఐటీఓ, ద్వారకా సెక్టార్-3 సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఫలితంగా గత కొద్దిరోజులతో పోలిస్తే గాలి నాణ్యత మెరుగుపడింది. గురువారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 460 ఉండగా, శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 408కి, 9 గంటల సమయానికి 376కు మెరుగైంది. కృత్రిమ వర్షం కురిపించేందుకు దిల్లీ సర్కారు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వాన పడటం విశేషం.
దీపావళికి ముందు వాతావరణం మెరుగుపడుతుందని భారత వాతావరణ శాఖ ఇదివరకే అంచనా వేసింది. స్వల్పంగా వర్షం కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. వాయు నాణ్యత సైతం మెరుగవుతుందని చెప్పింది. గాలి దిశ వాయువ్యం నుంచి ఆగ్నేయానికి మారే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పంట వ్యర్థాల పొగ ద్వారా దిల్లీలో ఏర్పడే కాలుష్యం తగ్గుతుందని అంచనా వేసింది.
వాహనాలపై నిషేధం.. అయినా..
మరోవైపు, దిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాయి. వాహనాల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- స్టేజీ-4ను కేంద్రం అమలు చేస్తోంది. దీని ప్రకారం.. బీఎస్-3 పెట్రోల్ వాహనాలు, బీఎస్-4 డీజిల్ వాహనాలు దిల్లీలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఏక్యూఐ 400 దాటితే ఈ నిబంధన అమలులోకి వస్తుంది. ప్రస్తుతం దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 400కు పైనే కొనసాగుతోంది.