తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 3:35 PM IST

ETV Bharat / bharat

రైల్వేస్టేషన్లలో మాస్క్‌ లేదంటే రూ.500 ఫైన్‌

కరోనా కేసులు పెరుగుతున్న వేళ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే పరిసరాల్లో కానీ, రైళ్లలో కానీ మాస్క్​ ధరించకపోతే రూ.500 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.

Railways
రైల్వేస్టేషన్

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే పరిసరాలు, రైళ్లలో మాస్క్‌ ధరించకపోతే నేరంగా పరిగణించి, రూ. 500 వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం అత్యవసరం. దీనికోసం గతేడాది మే 11న భారత రైల్వే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులందరూ మాస్క్‌లు విధిగా ధరించాలని సూచించింది. అయితే ఇప్పుడు ఈ మాస్క్‌ల వినియోగాన్ని ‘రైల్వే నిబంధనలు (రైల్వే పరిసరాలను అపరిశుభ్రం చేసే చర్యలకు పెనాల్టీలు విధించడం), 2012 చట్టం’ కిందకు తీసుకొచ్చాం. ఈ చట్టం ప్రకారం.. రైల్వే పరిసరాల్లో ఉమ్మడం లాంటివి చేస్తే వారిపై జరిమానా విధించొచ్చు. తాజా మార్పులతో మాస్క్‌లు ధరించని వారికి కూడా జరిమానా వేయనున్నాం. రైల్వే స్టేషన్లు, రైళ్లలో మాస్క్‌లు ధరించకుండా కన్పిస్తే రూ.500 వరకు జరిమానా ఉంటుంది’’

-రైల్వే శాఖ

ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఆరు నెలల వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఇవి అమలులో ఉంటాయని వెల్లడించింది.

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వరుసగా మూడో రోజు 2లక్షలకు పైగా కేసులు, 1000కి పైగా మరణాలు సంభవించాయి. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే సూచిస్తున్నా.. ఇంకా కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇదీ చదవండి:'టీఎంసీ విచ్ఛిన్నం.. శవ రాజకీయాల్లో దీదీ'

ABOUT THE AUTHOR

...view details