Railway Ticket Confirmation Rules :ముందుగా తమకు కేటాయించిన రిజర్వ్డ్ సీటును వేరే వ్యక్తులకు ఎలా కేటాయిస్తారన్న విషయంపై కోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తికి.. రూ.40 వేల నష్టపరిహారం చెల్లించాలని భారతీయ రైల్వే శాఖను ఆదేశించింది బెంగళూరులోని వినియోగదారుల కమిషన్.
అదనంగా చెల్లించి ప్రయాణం..
కర్ణాటక.. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటున్న అలోక్ కుమార్ అనే వ్యక్తి 2022 మార్చి 15న తల్లిదండ్రులు, అతడి ప్రయాణం కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేశాడు. మే 21న దిల్లీ నుంచి బిహార్‌లోని బరౌనీకి వెళ్లేందుకు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో రూ.6,995 చెల్లించి సీట్లను రిజర్వ్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రయాణం రోజున రైలు ఎక్కే సమయంలో ప్రయాణికుల పీఎన్ఆర్ (PNR) నంబర్ సరిగ్గానే ఉందని.. కానీ టికెట్ ఇంకా కన్ఫామ్ కాలేదని రైల్వే సిబ్బంది చెప్పారు. అందుకే వెంటనే రైలు దిగిపోవాలని.. లేదంటే ఫైన్ చెల్లించి ప్రయాణం కొనసాగించాలని రైల్వే సిబ్బంది సూచించారు. దీంతో వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు అలోక్ కుమార్ ఐఆర్‌సీటీసీని ఫోన్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాడు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల చేసేదేమీలేక అధికారులు చెప్పినట్లుగా అదనంగా రూ.22,300 జరిమానాను చెల్లించి ప్రయాణం చేశారు. ఆ తర్వాత అదనంగా చెల్లించిన ఈ ఫైన్‌ను వసూలు చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.