Railway Board Jaya Verma Sinha :భారతీయ రైల్వేలో అత్యంత కీలకమైన రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా శుక్రవారం జయవర్మ సిన్హా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న అనిల్ కుమార్ లహోటీ పదవీ కాలం గురువారం పూర్తయిన నేపథ్యంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. భారతీయ రైల్వేకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగానికి ఆమె సారథ్యం వహించనున్నారు. 118 ఏళ్ల చరిత్రలో రైల్వే బోర్డుకు ఓ మహిళ ఛైర్‌పర్సన్, సీఈఓ కావడం ఇదే తొలిసారి.
సరకు రవాణాలో 20 శాతం వృద్ధి..
జయవర్మ సిన్హా.. ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (ఐఆర్‌ఎంఎస్)కు చెందిన అధికారి. జవనరి 25న ఆమె రైల్వేబోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు బోర్డు సభ్యురాలిగా ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ వ్యవహారాలు చూశారు. భారతీయ రైల్వేలో సరకు రవాణా, ప్రయాణికుల సేవల విభాగాల పూర్తి బాధ్యత ఆమెదే. గత రెండేళ్లలో రైల్వే విభాగం సరకు రావాణా విభాగంలో 20శాతం వృద్ధి నమోదు చేయడం, ఏడాదికి 1.5బిలియన్ టన్నుల మార్కును దాటడం గమనార్హం.
Railway Board CEO : భారతీయ రైల్వేలో 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు జయవర్మ సిన్హా. ఆమె అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. 1988లో రైల్వేలో చేరాక.. ఆగ్నేయ, ఉత్తర, తూర్పు జోన్లలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్‌లో 4 సంవత్సరాలు రైల్వే సలహాదారుగానూ పనిచేశారు. ఆమె ఆ బాధ్యతలు నిర్వర్తిస్తుండగానే కోల్‌కతా-ఢాకా మధ్య మైత్రీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఇటీవల బాలేశ్వర్ రైలు దుర్ఘటన తర్వాత రైళ్ల రాకపోకల పునరుద్ధరణ చర్యలను సిన్హా పర్యవేక్షించారు. సంక్లిష్టమైన సిగ్నల్ వ్యవస్థ గురించి ప్రధాన మంత్రికి వివరించారు. సెప్టెంబరు 30నే జయవర్మ సిన్హా పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. పునర్ నియామకంపై అక్టోబరు 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఆమె రైల్వే బోర్డు ఛైర్‌పర్సన్ పదవిలో కొనసాగుతారు.