కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతు సంఘాలు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాయి. ఇటీవల జాతీయ, రాష్ట్ర రహదారుల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రైతు సంఘాల నేతలు నేడు దేశవ్యాప్తంగా రైల్‌రోకో చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దేశవ్యాప్తంగా రైళ్లను అడ్డుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరింది.
20వేల బలగాల మోహరింపు..
సంయుక్త కిసాన్ మోర్చా.. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ రైల్‌రోకోకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి సిద్ధమైంది రైల్వే పరిరక్షణ దళం(ఆర్పీఎఫ్). సుమారు 20వేల మంది అదనపు బలగాలను దేశవ్యాప్తంగా మోహరించనుంది. ముఖ్యంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్న కారణంగా ఆ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
రైలు ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటమే తమ ప్రధాన ఉద్దేశ్యమన్నారు ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్. శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత జిల్లా అధికార యంత్రాంగంతో పర్యవేక్షిస్తున్నామని, స్థానికంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:బంగాల్ మంత్రిపై బాంబు దాడి