Rahul Satyapal Malik Interview :బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ రెండింటినీ నెరవేరుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు సత్యపాల్ మాలిక్ . ఈ వీడియోను రాహుల్ గాంధీ తన సామాజిక మాధ్యమం ఛానెల్‌లో పోస్ట్ చేశారు.
"ఆర్టికల్ 370 రద్దు కన్నా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించడమే స్థానికుల మనసులను అధికంగా గాయపరిచింది. ఆ అభిప్రాయంతో ఏకీభవించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో ఈ విషయాన్ని గుర్తించారు. జమ్ముకశ్మీర్ సమస్యను సైనిక బలంతో పరిష్కరించలేరు. ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏదైనా సాధించగలరు"
-- సత్యపాల్ మాలిక్, కశ్మీర్ మాజీ గవర్నర్
2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుందని సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. ప్రధాని మోదీ అధికార వ్యామోహంతో ఉన్నారని విమర్శించారు. ప్రతి చిన్న విషయాన్నీ ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని ఆక్షేపించారు. 2019 పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన సైనికులకు నివాళులర్పించేందుకు ప్రధాని.. శ్రీనగర్‌కు వెళ్లి ఉండాల్సిందని మాలిక్ అన్నారు.