Rahul on Upcoming Elections :రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మాత్రం కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లో కూడా తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. ఆదివారం దిల్లీలోని అశోకా హోటల్లో జరిగిన 'ది కాంక్లేవ్ రెండో ఎడిషన్' చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు.
కర్ణాటక ఎన్నికల నుంచి తాము చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నట్లు తెలిపారు రాహుల్ గాంధీ. తమ ఉద్దేశ్యాన్ని ప్రజలు చెప్పకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఒకే దేశం-ఒకే ఎన్నికపై స్పందించిన రాహుల్.. ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ పన్నిన ఓ వ్యూహంగా దాన్ని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ కన్నా కాంగ్రెస్‌యే ముందుంజలో ఉందన్న రాహుల్.. అక్కడ ఆ పార్టీ పూర్తి క్షీణించిందన్నారు.
"దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొందరి వద్దే డబ్బంతా పోగైంది. అసమానతలు, భారీ స్థాయిలో నిరుద్యోగం, ఓబీసీలు, గిరిజనులపై బీజేపీ పక్షపాతం వంటివి ప్రధానంగా ఉన్నాయి. కానీ బీజేపీ ఎప్పుడు వీటి ఆధారంగా ఎన్నికల్లో పోటీ చేయదు.ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. దేశం పేరు మారుద్దామని అంటోంది" అని బీజేపీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. వాటిని తాము అర్థం చేసుకున్నామని, అలా చేయనివ్వమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయన్న రాహుల్.. 2024 ఎన్నికల్లో బీజేపీ ఆశ్చర్యానికి గురవుతుందని పేర్కొన్నారు.