Rahul Meets Wrestlers :బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషన్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య-డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని నిరసిస్తూ పలువురు మల్లయోధులు అవార్డులు తిరిగి ఇచ్చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వారిని బుధవారం కలిశారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఛరా గ్రామంలో వీరేంద్ర ఆర్య అఖారాకు వెళ్లిన ఆయన రెజ్లర్లతో మాట్లాడారు. కొద్ది సేపు వారితో మట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాహుల్ గాంధీ తమ రెజ్లింగ్ రొటీన్‌ను చూడటానికి మాత్రమే వచ్చారని, ఆయన కూడా సరదాగా మల్లయోధులతో కుస్తీ తలపడ్డారని ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియా తెలిపాడు
'రాహుల్ ఏం చేయగలరు?'
ఝజ్జర్ జిల్లా ఛరా గ్రామంలోని వీరేందర్ ఆర్య అఖారాలో రెజర్లను రాహుల్ కలిసిన అనంతరం రెజ్లింగ్ కోచ్ వీరేందర్ ఆర్య మాట్లాడాడు. 'రాహుల్ గాంధీ వస్తున్నారని మాకు ఎటువంటి సమాచారం లేదు. మేం ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన అకస్మాతుగా వచ్చారు. ఉదయం 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన ఇక్కడకు వచ్చారు. మాతో కలిసి కాసేపు వ్యాయామం చేశారు. వ్యాయామం, క్రీడ గురించి చర్చించారు. క్రీడల గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది. నేషనల్ ఈవెంట్స్ జరగనున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యతో ఏం చేయగలము? అయినా ఈ విషయమై రాహుల్ గాంధీ ఏం చేయగలరు? ఏదైనా చేస్తే ప్రభుత్వమే చేయగలదు' అని కోచ్ వీరేందర్ ఆర్య అభిప్రాయపడ్డారు.
అవార్డులు వెనక్కి
WFI Crisis : ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య- డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌సింగ్ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఈ పరిణామం రెజ్లర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేశారు చాలామంది రెజ్లర్లు. దీనిని నిరసిస్తూ ఒక్కొక్కరుగా తాము సాధించిన పతకాలు, అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా, తన ఖేల్‌రత్న, అర్జున అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రకటించారు. బజ్‌రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేశారు.