తెలంగాణ

telangana

ఉద్రిక్తంగా రాహుల్ మణిపుర్ పర్యటన.. సైన్యంపై సాయుధుల కాల్పులు.. ఒకరు మృతి

By

Published : Jun 29, 2023, 8:31 PM IST

Rahul Manipur visit : మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్‌గాంధీని మణిపుర్ పోలీసులు అడ్డుకోవడం ఆందోళనకు దారితీసింది. భద్రతా చర్యల్లో భాగంగానే రాహుల్‌ కాన్వాయ్‌ను ఆపేసినట్లు చెప్పారు. మరోవైపు, మణిపుర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. సాయుధులైన అల్లరిమూకలు భద్రతాదళాలపై కాల్పులు జరిపినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయినట్లు తెలిపింది.

rahul-manipur-visit
rahul-manipur-visit

Rahul Manipur visit : అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణల్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కొద్దిసేపు మణిపుర్‌ పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీ నుంచి మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌ చేరుకున్న రాహుల్‌, రోడ్డు మార్గం ద్వారా చురచంద్‌పుర్‌కు బయలుదేరారు. అయితే, భద్రతా కారణాలతో రోడ్డుమార్గం ద్వారా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాహుల్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారని, ఈ క్రమంలో దాడి జరిగే ప్రమాదం ఉందనే అనుమానంతో ఆయన్ను అడ్డుకున్నట్లు బిష్ణుపూర్ ఎస్పీ తెలిపారు.

Manipur violence : అయితే, రాహుల్‌ను అడ్డుకున్నందుకు నిరసనగానూ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. రాహుల్​ను ముందుకు వెళ్లేందుకు అనుమతించాలని పలువురు మహిళలు పోలీసులను డిమాండ్ చేశారు. ఆయన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ఒక దశలో భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో తిరిగి ఇంఫాల్‌ చేరుకున్న రాహుల్‌.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో చురచంద్‌పుర్‌ వెళ్లి బాధితులను పరామర్శించారు. తాత్కాలిక శిబిరాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడారు. మణిపుర్​లో శాంతి నెలకొనేలా చూడటమే తమ ప్రాధ్యాన్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

"మణిపుర్ కోలుకుంటోంది. శాంతి నెలకొల్పడమే మన ప్రాధాన్యం కావాలి. అన్ని వర్గాల ప్రజలు ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం నన్ను అడ్డుకోవడం విచారకరం. మణిపుర్​లోని నా సోదరసోదరిమణుల సమస్యల గురించి తెలుసుకునేందుకే నేను వచ్చా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Manipur news today : మణిపుర్‌లో రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. బాధితులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న రాహుల్‌ను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ నిరంకుశ విధానాలు అవలంబిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వ నిర్బంధ చర్య రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. శిబిరాల్లో ఉంటున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు రాహుల్‌ అక్కడికి వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు. మణిపుర్‌ అల్లర్లపై మౌనం వీడని ప్రధాని ప్రతిపక్షాలపై మాత్రం నిర్బంధకాండ అమలు చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. మణిపుర్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలని, ఘర్షణలు కాదన్నారు.

మణిపుర్​లోని అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ప్రభుత్వం రాహుల్ గాంధీ పర్యటనను ఎందుకు అడ్డుకోవాలని చూస్తోందని ప్రశ్నించారు. 'రిలీఫ్ క్యాంపులను మేం సందర్శించాం. ఎక్కడ చూసినా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వారి గోడును వినేవారు కావాలి. రాహుల్ అందరి బాధలు వింటారు. శాంతియుత వాతావరణం నెలకొంటుందనే సందేశం రాహుల్ వారికి అందించారు. ప్రజలంతా వారికి అండగా ఉన్న విషయాన్ని చెప్పారు' అని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.

'బాధ్యత లేదా?'
మరోవైపు, రాహుల్​పై తీవ్ర స్థాయిలో మండిపడింది అధికార బీజేపీ. రాహుల్ నిర్లక్ష్య ప్రవర్తన వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయిందని ఆరోపించింది. రాహుల్ బాధ్యతతో ఉండాల్సిందని పేర్కొంది. 'మొండితనంతో రాహుల్ గాంధీ మణిపుర్ వెళ్లడం బాధాకరం. అది సరైంది కాదు. సున్నితమైన ఈ విషయంలో మంకుపట్టు పనికిరాదు. రాహుల్ గాంధీ, బాధ్యతాయుత ప్రవర్తన ఒక్కచోట ఉండవన్న విషయం మరోసారి రుజువైంది. రాహుల్ పర్యటన వల్ల ఒక ప్రాణం పోయిందని వార్తలు వస్తున్నాయి' అని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర దుయ్యబట్టారు.

మరోవైపు, గురువారం ఉదయం 5.30 గంటలకు ఇంఫాల్​లోని హరావ్​తేల్ గ్రామంలో సాయుధ నిరసనకారులు కాల్పులకు తెగబడ్డారని ఆర్మీ తెలిపింది. సైనిక దళాలు గట్టిగా ప్రతిస్పందించడం వల్ల కాల్పులు ఆగాయాని వెల్లడించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఘటనాస్థలికి మరిన్ని బలగాలను తీసుకొచ్చినట్లు వివరించింది. సాయంత్రం 4 గంటలకు సైతం కాల్పుల శబ్దం వినిపించిందని ట్వీట్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details