తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా నాన్నను చంపినవారిపై కోపం లేదు.. క్షమించేశా' - "I forgive," says Rahul Gandhi on his father Rajiv's killers

దాదాపు ఐదేళ్ల పాటు పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేశారని కేంద్రంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. ప్రజలు ఇచ్చిన తీర్పును మోదీ లెక్కచేయలేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన రాహుల్.. తన తండ్రి రాజీవ్ గాంధీ మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"I forgive," says Rahul Gandhi on his father Rajiv's killers
రాజీవ్ గాంధీ మృతిపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

By

Published : Feb 17, 2021, 8:12 PM IST

పుదుచ్చేరి పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమకు ఏం జరుగుతుందో అని భయపడకుండా పౌరులు న్యాయం పొందలేకపోతున్నారని అన్నారు. ఓవైపు జర్నలిస్టులు ప్రాణభయంతో ఉంటే.. ఎలాంటి చర్చలు జరగకుండానే పార్లమెంట్​లో బిల్లులను ఆమోదిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన తమలాంటి నేతలకు.. లోక్​సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పారు. మోదీ తనని తాను ప్రధానిగా కాకుండా.. ఓ రాజులా భావించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దాదాపు ఐదేళ్ల పాటు పనిచేయకుండా చేశారని మండిపడ్డారు రాహుల్. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

"ప్రజాతీర్పుకు ప్రధానమంత్రి విలువ ఇవ్వలేదు. మీ(ప్రజలు) ఓట్లకు విలువ లేదని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ద్వారా మోదీ పదేపదే సందేశం ఇచ్చారు. మీ కలలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేశారు. అన్ని ప్రభుత్వ సంస్థల మాదిరిగానే .. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

రాజీవ్ మరణంపై..

పర్యటన సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన రాహుల్.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృతిపై మాట్లాడారు. తన తండ్రి మరణం తీవ్ర మనోవేదన కలిగించిందని చెప్పారు. ఆయన దూరమైన క్షణాలు ఎంతో బాధాకరమైనవని చెప్పారు రాహుల్. అయితే ఈ విషయంపై ఎవరిపైనా కోపం, ద్వేషం లేవని స్పష్టం చేశారు. ఆయనను హత్య చేసినవారిని క్షమించానన్నారు.

రాజీవ్​ను ఎల్​టీటీఈ(లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) వర్గానికి చెందినవారు హత్య చేయడంపై ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

"నాకు ఎవరిమీదా కోపం, ద్వేషం లేదు. మా నాన్నను కోల్పోయాను. అది నాకు అత్యంత కష్టకాలం. గుండెను కోసి బయటకు లాగినట్లు అనిపించేది. చాలా మనోవేదన అనుభవించాను. కానీ నాకు కోపం లేదు. నేను క్షమించేశా."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

రాజీవ్​తో పాటు తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కోల్పోవడంపై మరో విద్యార్థి ప్రశ్నించగా.. హింస.. మన నుంచి దేన్నీ లాక్కోలేదని అన్నారు రాహుల్. రాజీవ్ గాంధీ తనలో సజీవంగా ఉన్నారని, తనలో నుంచి ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:రాజకీయ సంక్షోభం వేళ పుదుచ్చేరికి రాహుల్

ABOUT THE AUTHOR

...view details