బడా వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని మరోమారు తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేరళకు చేరుకున్నారు రాహుల్.
లాక్డౌన్లో భారత బిలియనీర్ల సంపద రెట్టింపైందన్న ఆక్స్ఫామ్ నివేదికను మీడియాతో పంచుకున్న రాహుల్.. కొందరు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ప్రధాని దేశాన్ని నడుపిస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం సహా.. ఉపాధి కల్పనలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. దేశ పారిశ్రామిక రంగం ఏకఛత్రాధిపత్యం దిశగా పయనిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలు దేశీయ పరిశ్రమలను నియంత్రిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసునన్నారు.