దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న లక్షద్వీప్ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పర్యావరణ పవిత్రతను, భూ యాజమాన్య రక్షణను లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అథారిటీ అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల భవిష్యత్తుకు ముప్పు కలిగించేలా అక్కడి అడ్మినిస్ట్రేటర్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భారత ప్రధాన భూభాగానికి దూరంగా, అరేబియా సముద్రంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతమైన 'లక్ష ద్వీప్'లో రాజకీయ కార్యకలాపాలు చాలా తక్కువ. ప్రముఖ పర్యటక ప్రాంతంగానే దీనికి గుర్తింపు ఉంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ 'సేవ్ లక్ష ద్వీప్' అంటూ ఏకంగా ఉద్యమమే సాగుతోంది. ఇందుకు ఇతర ప్రాంతాల్లోనూ మద్దతు లభిస్తోంది. 'లక్షదీప్‌కు కొత్త రూపం' పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె పటేల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే దీనికంతటికీ కారణం.
'లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాపార లాభాల కోసం ప్రజల జీవనోపాధిని, భద్రతను పణంగా పెడుతున్నారు. ప్రశాంతంగా ఉండే ద్వీపంలో శాంతిభద్రతల పేరుతో కఠిన నిబందనలు విధించే ప్రయత్నం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు.' అని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు.