ప్రత్యర్థులను చూసి తాము బెదిరిపోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. విపక్షాలను భయపెట్టలేమన్న వాస్తవాన్ని బీజేపీ అర్థం చేసుకోలేకపోవడం ఆశ్చర్యకరమని చెప్పుకొచ్చారు. లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసినా, ఎంపీ అనే పేరును తీసేసుకున్నా, జైల్లో వేసినా.. కేరళలోని వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని రాహుల్ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన అనంతరం తొలిసారి తన నియోజకవర్గంలో పర్యటించిన రాహుల్.. బీజేపీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
"ఎంపీ అనేది ఓ ట్యాగ్/ హోదా మాత్రమే. ఎంపీ అనే పేరును, హోదాను బీజేపీ నా దగ్గరి నుంచి లాగేసుకోవచ్చు. ఇంటి నుంచి బయటకు పంపి నన్ను జైల్లో పెట్టొచ్చు. కానీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా నన్ను ఆపలేరు. నాపై అనర్హత వేసిన తర్వాత వయనాడ్ ప్రజలతో నాకు ఉన్న బంధం మరింత బలపడింది. పోలీసులను ఇంటికి పంపించి నన్ను భయపెట్టాలని వారు అనుకున్నారు. నా ఇంటిని వారు తీసేసుకున్నందుకు నాకు సంతోషమే. ఎలాగో ఆ ఇంట్లో నాకు సంతృప్తి లేదు."
-రాహుల్ గాంధీ, వయనాడ్ మాజీ ఎంపీ
పార్లమెంట్ వేదికగా బీజేపీ మంత్రులు తనపై అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పేందుకు మాత్రం తనను అనుమతించలేదని అన్నారు. స్పీకర్ వద్దకు వెళ్లినా లాభం లేకపోయిందని చెప్పారు. 'మీరు నాపై ఎంతగా మాటల దాడికి దిగినా.. నేను వెనక్కి తగ్గను. నేను మాట్లాడుతూనే ఉంటా' అని రాహుల్ స్పష్టం చేశారు.
వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక రాహుల్ ధైర్యశీలి: ప్రియాంక
ప్రధాన మంత్రిని ప్రశ్నలు అడిగినందుకే రాహుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. రాహుల్‌తో పాటు వయనాడ్ పర్యటనకు వెళ్లిన ప్రియాంక.. బీజేపీ సర్కారు కనికరం లేకుండా రాహుల్‌పై దాడి చేస్తోందని మండిపడ్డారు. రాహుల్‌ను ధైర్యవంతుడిగా, దయార్ద్ర హృదయుడిగా అభివర్ణించిన ప్రియాంక.. నోరు మూయించాలని అనుకుంటున్న వారికి ఆయన భయపడరని పేర్కొన్నారు. రాహుల్.. తమ బాధలను విని, సాయం చేస్తారన్న విషయం వయనాడ్ ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో వయనాడ్ ప్రజల పక్షాన రాహుల్ నిలబడ్డారని అన్నారు.
వయనాడ్‌లో రాహుల్, ప్రియాంక రోడ్‌షో సత్యమేవ జయతే పేరుతో కాల్పెట్ట ప్రాంతం నుంచి భారీ రోడ్‌షో నిర్వహించారు రాహుల్. ఈ సందర్భంగా రాహుల్, ప్రియాంకకు.. యూడీఎఫ్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలకు బదులుగా.. జాతీయ జెండాలు పట్టుకొని ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. బహిరంగ సభకు సైతం భారీగా జనం హాజరయ్యారు. యూడీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు పనాక్కడ్ సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ థంగల్, కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ పాల్గొన్నారు.